TS Assembly Elections 2023 : రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం అత్యాధునిక, నూతన ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ చెప్పారు. ఇప్పటికే 1,65,685 ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) అందాయన్న ఆయన... రాష్ట్రంలో 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 34,891 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్న సీఈవో వికాస్‌రాజ్... ఒక పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లు పెరిగే కొద్దీ వాటి సంఖ్యా పెరుగుతుందని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కసరత్తు చేపట్టిన నేపథ్యంలో ఆయన 'ఈటీవీ-భారత్'తో మాట్లాడారు.
'ఎన్నికల ప్రక్రియను చేపట్టాం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది. గతంలో రాష్ట్రానికి హైదరాబాద్, బెంగళూరులలో తయారైన ఈవీఎంలను కేటాయించేవారు. ఈ దఫా హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ తయారు చేసిన ఈవీఎంలనే కేటాయించారు. గతంలో కూడా అత్యాధునిక ఎం-3 యంత్రాలను కొన్నింటిని వినియోగించినప్పటికీ ఈసారి వాటినే పూర్తిస్థాయిలో వినియోగించనున్నాం. 63,120 బ్యాలెట్ యూనిట్లు, 49,310 కంట్రోల్ యూనిట్లు, 53,255 వీవీప్యాట్స్ అందాయి. మరికొన్ని వస్తాయి.' - వికాస్ రాజ్, తెలంగాణ సీఈవో
Telangana CEO VIkas Raj Interview : ఇప్పటివరకు 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు అయ్యేందుకు జనవరి ఒకటో తేదీని ప్రామాణికంగా తీసుకునే విధానం ఉందని సీఈవో వికాస్‌రాజ్ అన్నారు. ఈ కారణంగా జనవరి ఒకటో తేదీ తరవాత పుట్టిన వారు ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు మరో ఏడాది వేచి ఉండాల్సి వస్తోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నాలుగు తేదీలను ప్రామాణికంగా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించిందన్న ఆయన... జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు ఒకటో తేదీలను ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరిగే సందర్భాల్లో తొలి ఓటర్లు ఎక్కువ మంది నమోదు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేశారు.