తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కు ఉంటేనే ఓటర్లకు ప్రవేశం: ఎన్నికల కమిషనర్​ పార్థసారథి - State Election Commissioner Parthasarathy talk about ghmc elections

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో మాస్కు ఉంటేనే ఓటర్లకు ప్రవేశమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథి వెల్లడించారు. ఎన్నికల సిబ్బంది కోసం 1.20 లక్షల పీపీఈ కిట్లు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న పార్థసారథితో ఈటీవీ భారత్​ ప్రత్యేక ఇంటర్యూ. జీహెచ్​ఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై ఆయన మాటల్లోనే విందాం.

etv bharat interview with State Election Commissioner Parthasarathy about ghmc elections polling
etv bharat interview with State Election Commissioner Parthasarathy about ghmc elections polling

By

Published : Nov 28, 2020, 6:55 AM IST

‘హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద సూక్ష్మ పరిశీలకులతో సహా పూర్తిస్థాయిలో పోలీసు సిబ్బంది ఉంటారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశమివ్వం. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్వేషకర ప్రసంగాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటాం’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం, పరస్పర ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో డిసెంబరు ఒకటిన పోలింగ్‌కు తీసుకుంటున్న చర్యలను ‘ఈనాడు- ఈటీవీ భారత్​’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిషనర్‌ వివరించారు. ఓటర్లు తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని ఆయన సూచించారు. చేర్పులు, తీసివేతల తర్వాత ఈ ఎన్నికల్లో 74.44 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ముఖాముఖి ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • గ్రేటర్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కరోనా నేపథ్యంలో పాటించే జాగ్రత్తలేమిటి...

కరోనా దృష్ట్యా సిబ్బందికి శిక్షణ మొదలుకొని... పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాం. మాస్కు ధరించడం, దూరం పాటించడం, శానిటైజ్‌ చేసుకోవడం కచ్చితంగా అమలు చేస్తున్నాం. ప్రతి పోలింగు కేంద్రాన్ని ఒక రోజు ముందే శానిటైజ్‌ చేస్తాం. నోడల్‌ వైద్యబృందాలు ఉంటాయి. పోలింగ్‌ సిబ్బంది కోసం 1.20 లక్షల పీపీఈ కిట్లతో పాటు 60 వేల శానిటైజర్‌ సీసాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్లు నిర్ణీత దూరంలో నిలబడేందుకు వలయాకార గుర్తులు ఏర్పాటు చేశాం. ప్రతి ఓటరు మాస్కు లేనిదే ప్రవేశించకుండా తనిఖీ చేయడం, ప్రవేశద్వారం వద్దనే శానిటైజర్‌ ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టాం.

  • ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌ పత్రాలతో ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది..

వీవీప్యాట్‌లు, స్లిప్పులు లెక్కించడానికి పట్టే సమయంతో పోలిస్తే బ్యాలెట్‌ ఉపయోగించడం వల్ల పెద్దగా జాప్యం కాదు. ఈ విషయాన్ని మేం నిరూపిస్తాం. బ్యాలెట్‌ పత్రాల వల్ల రిగ్గింగ్‌ జరుగుతుందనేది గతం. ఓటరు కార్డుపైన, పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్ల వద్ద ఉండే జాబితాల్లోనూ ఫొటోలుంటాయి. ఎన్నికల కమిషన్‌ అనుమతించిన 18 రకాల ధ్రువీకరణ పత్రాల్లోనూ ఫొటోలుంటాయి. దొంగ ఓట్లకు ఆస్కారమివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పోలైన వాటిలో 0.1 శాతం టెండర్‌ ఓట్లుంటే రీ పోలింగ్‌కు వెళ్లాలి. ఇందుకు అవకాశమే లేదు. 5532 పోలింగ్‌ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులు ఉంటారు. 1177 కేంద్రాల్లో ఒక్కొక్క చోట ఇద్దరు సూక్ష్మపరిశీలకులు, ఇద్దరు వీడియోగ్రాఫర్లతో పాటు ఎక్కువ సంఖ్యలో పోలీసులు ఉంటారు. ఇక్కడ ఒక్కో కేంద్రంలో 11 బూత్‌లు ఉంటాయి. 109 కేంద్రాల్లో ముగ్గురు చొప్పున సూక్ష్మ పరిశీలకులు, ముగ్గురు వీడియోగ్రాఫర్లు ఉంటారు.

  • పోలింగ్‌ శాతం పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓటరు చీటీల పంపిణీ పూర్తిస్థాయిలో జరగకుండా ఇది సాధ్యమేనా...

శుక్రవారం సాయంత్రం వరకు 55 శాతం ఓటరు చీటీలు పంపిణీ చేశాం. ఇంకో రెండు రోజులు గడువు పొడిగించాం. 29వ తేదీ నాటికి నూరు శాతం పంపిణీ జరుగుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హామీ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటరు చీటీలు ఇవ్వవు. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకుండా స్లిప్పులు ఇవ్వొచ్చు.

  • చాలా డివిజన్లలో పాత పోలింగ్‌ కేంద్రాలను మార్చారు. కొన్ని చోట్ల కేంద్రాలు చాలా దూరంలో ఉన్నాయి. ఇది ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందా..

పోలింగ్‌ కేంద్రం ఒక కిలోమీటరు దూరంలోనే ఉంటుంది. గతంలో ఒక కేంద్రంలో 1200 మంది ఓటర్లు ఉండేవారు. కరోనా కారణంగా దాన్ని వెయ్యికి తగ్గించాం. దీంతో 1200 పోలింగ్‌ స్టేషన్లు పెరిగి మొత్తం 9101 అయ్యాయి. ఓటర్లు గత ఎన్నికల్లో ఓటు వేసిన చోటే ఇప్పుడు కూడా వేస్తారు. 1500 మంది ఓటర్లు ఉంటే వెయ్యి మందికి ఒక బూత్‌, 500 మందికి మరో బూత్‌ ఉంటాయి. అయితే గత ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాలుగా ఉన్న భవనాలు ఇప్పుడు లేవు. అలాంటి చోట సమీపంలోని కమ్యూనిటీ హాలులో కేంద్రాలు ఏర్పాటు చేశాం. మొత్తం 28,683 బ్యాలెట్‌ పెట్టెలు వినియోగిస్తున్నాం. సగటున డివిజన్‌కు ఎనిమిది మంది చొప్పున 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా జంగంమెట్‌లో 45 మంది పోటీలో నిలిచారు. అతి తక్కువగా అయిదు వార్డుల్లో మూడేసి మంది చొప్పున మాత్రమే ఉన్నారు.

  • మద్యం, ధన ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారు..

ఎన్నికల్లో 52500 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం. నిరంతరం పర్యటించేలా 60 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేశాం. మరో 30 స్క్వాడ్‌లు అవసరమైన చోటుకు వెళ్లడానికి అందుబాటులో ఉంటాయి. 30 పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. వీటిలో ఎక్సైజ్‌ సిబ్బంది కూడా ఉంటారు. ప్రతిరోజు మద్యం విక్రయాలను పర్యవేక్షిస్తున్నాం. అనుమతి లేని మద్యం దుకాణాలను తొలగించాం. ఇప్పటివరకు మద్యం, నగదు స్వాధీనం సహా 54 కేసులు నమోదు చేశాం.

  • ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిపై కేసులేమైనా నమోదు చేశారా..

విద్వేషాలు రెచ్చగొట్టేలా... ఇతరులను కించపరిచేలా మాట్లాడే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక పరిశీలకులు కూడావీటిని ఎప్పటికప్పుడుపరిశీలిస్తుంటారు.

వారికి తపాలా ఓటు
దివ్యాంగులు, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, నవంబరు ఒకటి తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి తపాలా బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాం. వీటిపై విస్తృత ప్రచారం చేస్తున్నాం. - రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి

ABOUT THE AUTHOR

...view details