తెలంగాణ

telangana

ETV Bharat / state

మహా నగరానికి మరిన్ని నగిషీలు: మేయర్‌ విజయలక్ష్మి - ETV Bharat Chit Chat with New Mayor Gadwal Vijayalakshmi

అత్యుత్తమ పౌరసేవలు.. అవినీతిలేని స్వచ్ఛమైన పాలన, ప్రజలందరికీ సౌకర్యాల కల్పనతో పాటు మహిళలకు సంపూర్ణ రక్షణకు కృషి చేస్తానని హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కొత్త మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. పదవిని అధికారంగా కాకుండా బృహత్తర బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తాను ముక్కుసూటిగా ఉంటానని, తన వద్ద ఎవరి పైరవీలు, ఎలాంటి ఒత్తిళ్లు పనిచేయవని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటానని శుక్రవారం 'ఈనాడు-ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

మహా నగరానికి మరిన్ని నగిషీలు: మేయర్‌ విజయలక్ష్మి
మహా నగరానికి మరిన్ని నగిషీలు: మేయర్‌ విజయలక్ష్మి

By

Published : Feb 13, 2021, 8:05 AM IST

  • కోటిమంది జనాభా ఉన్న నగరానికి ప్రథమ పౌరురాలవుతానని ఎప్పుడైనా అనుకున్నారా?

కచ్చితంగా ఊహించలేదు. కాకపోతే కొంత ఆశ ఉండేది. సీఎం కేసీఆర్‌ అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నాకు ఆ భాగ్యం దక్కడం అదృష్టం. డిప్యూటీ మేయర్‌గా కూడా మహిళను ఎంపిక చేయడం ఎంతో సంతోషం కలిగించింది.

  • మేయర్‌గా మీ ప్రాధాన్యాలేమిటి?

తెలంగాణ ప్రభుత్వానికి, తెరాస పార్టీకి స్పష్టమైన విధానాలున్నాయి. గత అయిదేళ్లలో మహానగరానికి కేసీఆర్‌, కేటీఆర్‌ నగిషీలు దిద్దారు. మేం వారి నమ్మకాన్ని నిలబెడతాం. సమర్థమైన పాలన, పారిశుద్ధ్యం, చక్కటి రహదారులు, ప్రయాణ వసతులు, బస్తీల సంపూర్ణాభివృద్ధి, కాలనీలకు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తాను. విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తాను. కార్పొరేటర్‌గా అయిదేళ్ల అనుభవం నాకు లాభిస్తుందని భావిస్తున్నాను.

  • మీరు విదేశాల్లో ఉండి వచ్చి జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్‌ కావాలని ఎందుకు అనుకున్నారు?

అమెరికాలో 17 సంవత్సరాలుండి వచ్చాను. ఇక్కడ లా ప్రాక్టీసు ప్రారంభించాను. బస్తీల నుంచి పలువురు పేదలు కోర్టు కేసులపై నా వద్దకు వచ్చేవారు. వారి జీవన పరిస్థితులు నన్ను ఎంతగానో కదిలించాయి. బస్తీలకు వెళ్లి వారికి చేతనైన సాయం చేసేదాన్ని. మా నాన్న కేశవరావు (కేకే) నుంచి రాజకీయాలపై అవగాహన కలిగింది. ఆయన ప్రోత్సాహంతో ప్రజాప్రతినిధిగా వారికి సేవలు అందించాలనుకొని కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచాను.

  • చాన్నాళ్లు అమెరికాలో ఉన్నారు కదా అక్కడి నగరాలకు, భాగ్యనగరానికి ఎలాంటి తేడా చూశారు?

అమెరికాలో జనసాంద్రత తక్కువ. మౌలిక సమస్యలుండవు. ఇక్కడ జనాభా ఎక్కువ. నిత్యం ఇక్కడికి వచ్చి స్థిరపడేవారి సంఖ్య భారీగా ఉంటోంది. ప్రజల అవసరాలు తీర్చడమే ప్రధాన సమస్య. కేసీఆర్‌ సీఎం అయ్యాక హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు పూనుకున్నారు. కేటీఆర్‌ పురపాలక మంత్రిగా నగర రూపురేఖలు మార్చివేశారు. ఇప్పుడు మంచినీటి కొరతలేదు. విద్యుత్‌ సమస్య తీరింది. మెట్రో రైలు వచ్చింది. కొత్త ఫ్లైఓవర్లు, రహదారుల నిర్మాణం జరుగుతోంది. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడింది. భారీ పెట్టుబడులతో ప్రసిద్ధ సంస్థలు ఇక్కడికి తరలివచ్చి కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. అన్నిప్రాంతాల ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారు.
అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. అనుమతుల మంజూరు వంటి పనుల్లో అవినీతి అరోపణలు వస్తున్నాయి.

అవినీతి, అక్రమాలను ఏమాత్రం సహించేది లేదు. నగరపాలనలో ఏమాత్రం రాజీలేదు. పురపాలక శాఖను కేటీఆర్‌ ప్రక్షాళన చేశారు. ఎవరైనా దారితప్పితే దండన ఖాయం. నిబంధనలకు విరుద్ధంగా ఏం జరగకుండా చూస్తాం.

  • మహిళలపై దాడులు, వేధింపులు పెరుగుతున్నాయి. దీన్ని ఎలా చక్కదిద్దుతారు?

మహిళలకు సంపూర్ణ రక్షణ కోసం మా పాలక మండలి పనిచేస్తుంది. పోలీసు శాఖ, షీటీమ్స్‌ సహకారంతో చర్యలు చేపడతాం. సౌకర్యాలపరంగా వారికి అన్ని విధాలా అండగా ఉంటాం.

  • 47 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం భాజపాతో ఎలా వ్యవహరిస్తారు?

కేటీఆర్‌ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు. అభివృద్ధికి అంతా కలిసిమెలిసి పనిచేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల కార్పొరేటర్లతో కలిసి పనిచేస్తాం.

  • హైదరాబాద్‌ ప్రజలకు మీరిచ్చే సందేశం?

ప్రజల సమస్యల పరిష్కారమే మా ధ్యేయం. అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం కావాలి. అందరం చేయిచేయి కలపాలి. అన్ని వర్గాల సహకారాన్ని కోరుతున్నాం.

  • మీ డివిజన్‌కు ఎలాంటి సేవలందించారు?

బస్తీలు, కాలనీలను సందర్శించి, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేశాను. అక్కడ ఒకటే ప్రభుత్వ పాఠశాల ఉంది. పేదల సంపాదన అంతా స్కూలు ఫీజులు కట్టడానికే సరిపోయేది. ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం కలిగించేందుకు అదనపు భవనాలు నిర్మించాం. ఖాళీ పోస్టుల్లో విద్యావాలంటీర్లను నియమింపజేశాం. దీంతో ఆదరణ పెరిగింది. ప్రైవేటు యాజమాన్యాలతో మాట్లాడి నిరుపేద పిల్లలకు ఉచిత విద్య అందివ్వడానికి ఒప్పించాం. బస్తీ దవాఖాన మంజూరు చేయించా. సామాజిక భవనం నిర్మించి, పేదలకు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు ఖర్చు లేకుండా చేశాను. డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి శిక్షణ అందించాం.

ABOUT THE AUTHOR

...view details