IAMC CEO Sitesh Mukherjee: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆలోచనలకు ప్రతిరూపంగా.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల 18న ప్రారంభం కానున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రపంచ దృష్టిని హైదరాబాద్ వైపు మరల్చనుందని ఆ కేంద్రం సీఈవో సితేష్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. బహుళజాతి సంస్థలు మొదలు సామాన్యుల వరకు అందరి వివాదాలను అతి తక్కువ వ్యయంతో అంతర్జాతీయ నిపుణులతో స్వల్ప సమయంలో పరిష్కరించడమే తమ లక్ష్యమని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులను, అన్ని విభాగాల్లో శిక్షణ పొందిన మధ్యవర్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తామన్నారు. విద్యుత్తు, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్ రంగాల్లో వాణిజ్య వివాదాల పరిష్కారంలో 25 ఏళ్లుగా సేవలందిస్తూ పలు అవార్డులు పొందిన ప్రముఖ న్యాయవాది, ఐఏఎంసీ సీఈవో సితేష్ ముఖర్జీ ‘ఈటీవీ భారత్’ ముఖాముఖిలో ఈ కేంద్రం పనితీరు, ఇతర అంశాల గురించి వివరించారు.
- ఇక్కడి పారిశ్రామికవేత్తలు లండన్, సింగపూర్ వంటి కేంద్రాలవైపు చూస్తున్నారు. ఐఏఎంసీ ఈ ధోరణిలో మార్పు తీసుకురాగలదా?
అన్ని అర్హతలున్న మధ్యవర్తులు, ఆర్బిట్రేటర్లు, వాణిజ్య న్యాయవాదులు, ఆయా రంగాల నిపుణులు మన దేశంలో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత స్థాయిలో సేవలందిస్తున్న వీరందరినీ ఐఏఎంసీ ఒకేతాటిపైకి తీసుకువచ్చి పార్టీలకు పరిచయం చేస్తుంది. నిపుణులైన ఆర్బిట్రేటర్లు, మధ్యవర్తులతోపాటు దూరదృష్టి ఉన్న న్యాయమూర్తులు మార్గదర్శనంచేసి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు.
- ఆర్బిట్రేషన్, కన్సీలియేషన్, మీడియేషన్‌లలో ఐఏఎంసీ పాత్ర ఎలా ఉండబోతోంది? వివాద పరిష్కారానికి ఎంత కాలం పట్టవచ్చు?
ఆర్బిట్రేషన్ నిమిత్తం పార్టీలే ఇద్దరు లేదా ముగ్గురు సభ్యుల్ని ఎంపిక చేసుకోవచ్చు. విచారణ ప్రక్రియ ఏవిధంగా కొనసాగించాలన్నదీ పార్టీలే నిర్ణయించుకోవచ్చు. అలా వారు నిర్ణయం తీసుకోలేని పక్షంలో ఐఏఎంసీ మార్గదర్శనం చేస్తుంది. 18 నుంచి 24 నెలల్లో పక్రియ పూర్తికావొచ్చు. చిన్న చిన్న ఆర్బిట్రేషన్లు మరింత త్వరగా ముగుస్తాయి. అదేవిధంగా రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలక పాత్ర పోషించనుంది. ఒక వివాదంపై మధ్యవర్తి ఇరుపక్షాలను ఒకేచోట కూర్చోబెట్టి లాభనష్టాలను వివరించి పరిష్కార దిశగా నడిపిస్తాడు. మధ్యవర్తిత్వం కొత్తపుంతలు తొక్కడానికి ఈ కేంద్రం అద్భుతమైన అవకాశం అందిస్తుందని విశ్వాసం ఉంది.
- అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి నిపుణులు అందుబాటులో ఉన్నారా?
అనుభవం ఉన్న ఆర్బిట్రేటర్ల కొరత లేదు. ఇప్పటికే ముగ్గురు ప్రముఖులైన నిపుణులు పాలకమండలిలో ఉన్నారు. ఇక్కడివారిని వినియోగించుకోవడంతోపాటు అంతర్జాతీయ నిపుణులనూ తీసుకువస్తాం.
- ఆర్బిట్రేషన్ చట్టానికి తీసుకొచ్చిన సవరణలు ఈ ప్రక్రియకు ఏ మేర దోహదం చేయగలవు?
2010లో బాల్కో కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత పార్లమెంట్ పలు సవరణలు తీసుకువచ్చింది. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు దీటుగా ఆర్బిట్రేషన్‌ను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడానికి న్యాయవ్యవస్థ ప్రగతి శీల తీర్పులను వెలువరించింది. 2019లో తీసుకువచ్చిన సవరణ ఆర్బిట్రేషన్ చట్టంలోని చిక్కుముళ్లను తొలగించడంతోపాటు గోప్యతకు అవసరమైన నిబంధనలను తెచ్చింది. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెద్ద సంఖ్యలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఐఏఎంసీ లాంటి సంస్థలు ఇలాంటి పిటిషన్లను తీసుకోగలిగితే కోర్టులపై కేసుల భారం తగ్గడంతోపాటు ఆర్బిట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.
- భవిష్యత్తులో వ్యాపార, వాణిజ్య వివాదాలను పరిష్కరించడంలో ఆర్బిట్రేషన్, కన్సీలియేషన్‌ల పాత్ర ఎలా ఉండబోతోంది?