Etela Rajender Respond TS BJP President Post : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. అప్పుడైనా.. ఇప్పుడైనా పదవి కావాలని అడిగేవాడిని కాదని పేర్కొన్నారు. తనకు ఏ బాధ్యత ఇవ్వాలనేది దిల్లీ నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు. బండి సంజయ్ మార్పు ఉండకపోవచ్చని ఈటల స్పష్టం చేశారు. బండి సంజయ్ తన శక్తిమేరకు పనిచేస్తున్నారని వివరించారు. హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
ఊహాగానాలు తప్పు :రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో గెలవాలంటే తమ శక్తిని ఇంకా పెంచుకోవాలని ఈటల రాజేెందర్ వెల్లడించారు. దిల్లీ నాయకత్వంతో పాటు.. తాము కూడా ఇదే భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తల బలం, సీనియర్ నాయకులు కావాలని వివరించారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో అందరిని భాగస్వామ్యులను చేసి.. పార్టీని విస్తరించాలని చర్చించారన్నారు. తనను ఎలా ఉపయోగించుకోవాలో జాతీయ నాయకత్వం ఆలోచిస్తోందని అన్నారు. అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న ఊహాగానాలు తప్పని వ్యాఖ్యానించారు. జాతీయ నేతలు రావటం, తాము దిల్లీ పోవటం సహజమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
"అప్పుడైనా.. ఇప్పుడైనా పదవి కావాలని అడిగేవాడిని కాదు. నాకు ఏ బాధ్యత ఇవ్వాలనేది దిల్లీ నాయకత్వం చూసుకుంటుంది బండి సంజయ్ మార్పు ఉండకపోవచ్చు. బండి సంజయ్ తన శక్తిమేరకు పనిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలవాలంటే మాశక్తిని ఇంకా పెంచుకోవాలి. దిల్లీ నాయకత్వంతో పాటు.. మేము కూడా ఇదే భావిస్తున్నాం. ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తల బలం, సీనియర్ నేతలు కావాలి. నన్ను ఎలా ఉపయోగించుకోవాలో జాతీయ నాయకత్వం ఆలోచిస్తోంది." - ఈటల రాజేందర్, ఎమ్మెల్యే
అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదు :ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదని ఆయన స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి వస్తున్న వార్తలు.. పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు. పార్టీ ఓ కుటుంబం లాంటిదని.. జాతీయ నేతలను రాష్ట్ర నాయకులు కలవటం సహజమని వివరించారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు రాష్ట్రంలో భవిష్యత్ లేదని బీఆర్ఎస్‌కు.. బీజేపీనే ప్రత్యామ్నాయమని కిషన్‌రెడ్డి వెల్లడించారు.