Etela Rajender Fires on CM KCR: రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తైయిన ఇంకా సంపూర్ణంగా అమలు కాలేదని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్(Etela Rajender) ఆరోపించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో బీజేపీ ఎస్సీ మోర్చా మండల రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖండ భారతం సుభిక్షంగా ఉండడానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. రాజకీయ నాయకుడు కావాలంటే మెరిట్ ఉండాలని.. రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని అమలు చేయడమే ఆ మెరిట్ అని అన్నారు.
BJP SC Morcha Programme: ఎమ్మెల్యే పదవి కొనుక్కుంటేనో, అడుక్కుంటేనో దక్కదని.. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓటు వేస్తే వస్తుందని వివరించారు. ధనికులకి అయినా.. పేదవారికి అయినా రాజ్యాంగం ద్వారా అందరికి సమానంగా ఓటు కల్పించారని చెప్పారు. దాన్ని మంచి మార్గంలో ఉపయోగించాలని అన్నారు. తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని పేర్కొన్నారు. అధికారం వచ్చాక మొదట దళిత సీఎంగా చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).. ఇప్పటి వరకు అది నిజం చేయలేదని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చినట్టే ఇచ్చి అవమానకరంగా తీసివేశారని ధ్వజమెత్తారు.
"రాష్ట్రంలో పేద దళితులకు కాకుండా బీఆర్ఎస్ నాయకులకు దళితబంధు ఇచ్చుకుంటున్నారు. కేసీఆర్ మాటలతో కాలం గడుపుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి తప్ప మరొకరికి సీఎం పదవి దక్కదు. కుల, మతాలు తేడా లేకుండా అందరికి అధికారం పంచే పార్టీ బీజేపీ మాత్రమే. హుజూరాబాద్‌లో ఆత్మగౌరవం ఎలా నిలబెట్టారో తెలంగాణ అంతా నిలబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నేతలు అందరు ఐక్యంగా ఉండి.. ప్రజల్లో చైతన్యాన్ని నింపాలి." - ఈటల రాజేందర్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్