Key development in Telangana BJP : తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిణామాలపై ఆ పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ నెలలో అగ్రనేతలు వరుసగా పర్యటించేందుకు సిద్ధం కాగా.. రాష్ట్ర నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత నెలలో అగ్రనేత అమిత్‌షాతో హుజూరాబాద్ ఎమ్మెల్యే, ప్రచార కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ భేటీ కాగా.. తాజాగా మరోసారి పిలుపు రావటం చర్చనీయంగా మారింది. ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత కమలదళంలో జోష్ రావటం, వరుసగా నేతల చేరికలతో బీజేపీ క్రమంగా బలపడుతూ వచ్చింది. కానీ.. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమితో చేరికలు లేకపోవటం, పార్టీలో కొత్తగా చేరిన వారికి, పాత నేతలకు మధ్య అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Telangana BJP Latest News : మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నందున పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను మార్చి.. మరొకరికి ఇవ్వాలనే ప్రతిపాదనలు అధిష్ఠానానికి వెళ్లినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్లో కీలక స్థాయిలో ఉన్న ఈటల రాజేందర్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదనే చర్చ సైతం కమలం నేతల్లో సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర పార్టీల అసంతృప్తులు భారతీయ జనతా పార్టీ వైపు చూసేందుకు ఆసక్తి కనబర్చకపోగా.. కర్ణాటక ఫలితాల అనంతరం మరింత డీలా పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈటలకు స్టార్ క్యాంపెయినర్ పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పార్టీలో బండి సంజయ్, ఈటల రెండు వర్గాలుగా విడిపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని భావించిన అధిష్ఠానం.. ఈ అసమ్మతికి చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కీలక పదవి ఆశిస్తోన్న ఈటలకు స్టార్ క్యాంపెయినర్ పదవి ఇస్తే అసమ్మతిని చల్లార్చవచ్చని భావిస్తోంది.
నేతలు జారిపోకుండా పక్కా ప్లాన్..: కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు పార్టీ వీడతారనే ప్రచారం జోరందుకోవడంతో అధిష్ఠానం మరింత అప్రమత్తమైంది. నేతలు ఎవ్వరూ జారిపోకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తోంది. ఈటలతో పాటు ముఖ్య నేతలకు కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా బీజేపీలో స్టార్ క్యాంపెయినర్ పదవి లేదు. నేతల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఈ పదవిని తెరపైకి తీసుకువస్తోంది.దీనికి స్టార్ క్యాంపెయినర్ పేరునే ఉంచుతారా.. లేక మరో పేరు పెడతారా అనే ఉత్కంఠ భాజపా శ్రేణుల్లో నెలకొంది.
కీలక పరిణామం పక్కా..: మరోవైపు.. పార్టీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై కొందరు నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో అంతర్గత అంశాలను బయటపెట్టినట్లైంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో ఈటల రాజేందర్ అధిష్ఠానంతో భేటీ కాగా... అధ్యక్షుడి మార్పు, ఈటలకు తగిన ప్రాధాన్యత కల్పించవచ్చనే వార్తలు వచ్చాయి. కానీ.. ఆ దిశగా ఎలాంటి నిర్ణయాలు జరగకపోగా.. ఈ నెలలో జాతీయ నాయకులంతా రాష్ట్రం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈటలకు అధిష్ఠానం నుంచి పిలుపు రావటం మరోసారి చర్చనీయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు అధ్యక్షుడి మార్పు లేకుండా ఈటలను బుజ్జగిస్తారా.. లేదంటే ఈటలకు ప్రాధాన్యత కల్పించేలా ప్రత్యేక బాధ్యతలు ఏమైనా కల్పిస్తారా అనే చర్చ సాగుతోంది. ఏదేమైనా ఈటల తాజా పర్యటనతో రాష్ట్ర బీజేపీలో మాత్రం కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.