Etela Rajender Comments on Revanth Reddy: కాంగ్రెస్ పార్టీని విమర్శించాను తప్పితే.. తాను రేవంత్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు. శుక్రవారం రేవంత్‌రెడ్డి మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నారని ఈటల ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు ప్రతిగా తాను ఎటువంటి డబ్బులు తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసి.. రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈటలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సమాధానంగా నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు.
జాతీయ పార్టీలకు దిల్లీ కేంద్రంగా రాజకీయాలు జరుగుతాయని ఈటల అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే కాంగ్రెస్ కంటే ఎక్కువగా స్పందించిన పార్టీ బీఆర్ఎస్నే అని గుర్తు చేశారు. ఆరోజు సీఎం కేసీఆరే స్వయంగా చీకటి రోజు అంటూ ప్రకటన ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సమస్యలపై పోరాడతాడనుకున్నా కానీ.. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటాడని అనుకోలేదని అన్నారు. ధీరుడు ఎప్పుడూ.. కన్నీళ్లు పెట్టుకోరని హితవు పలికారు. కన్నీళ్లు పెట్టుకుంటూ సంస్కారం హీనంగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించింది కేసీఆర్: చంద్రబాబు పంచన చేరి తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ అని ఈటల దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని.. ప్రజల కోసం తను ఎప్పుడూ జైలుకు వెళ్లలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించింది.. నామ రూపాలు లేకుండా చేయాలని చూసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని ఓడించేందుకు రేవంత్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కోమటిరెడ్డి, జానారెడ్డి బీఆర్ఎస్తో పొత్తుపై పరోక్షంగా చెప్పింది నిజం కాదా అని కాంగ్రెస్‌ను నిలదీశారు.