కేసీఆర్ సర్కారు ప్రజల విశ్వాసం కోల్పోయిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం అర్వింద్ ఇంటిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏ ప్రభుత్వమూ ఇలాంటి నీచమైన పనులు చేయలేదని టీఆర్ఎస్పై మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌పై సైతం ఇదే విధంగా దాడికి పాల్పడ్డారని ఈటల ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షాకు లేఖ రాస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని టీఆర్ఎస్ చూస్తోంది. సీఎం తన కుటుంబం కోసం మాత్రమే ఉన్నారు తప్పితే ప్రజల కోసం లేరని ఇప్పటికే టీఆర్ఎస్ కార్యకర్తలకు అర్థమైంది. బీజేపీ కార్యకర్తల రక్తాన్ని కళ్ల చూసి తన పార్టీని బతికించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజలపైనే దాడులు చేస్తారా.. ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది. పోలీసులు కేసీఆర్‌కు బానిసలుగా పని చేస్తున్నారు.- ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే