ఈఎస్ఐ-ఐఎంఎస్ కుంభకోణంలో కీలక సూత్రధారుల చుట్టు అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగించేలా కసరత్తు చేస్తోంది. ఆ విభాగం సంచాలకురాలు దేవికారాణి, సంయుక్త సంచాలకురాలు పద్మ సహా ఏడుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ కుంభకోణంలో ఇంకా అనేక మందికి ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 23 మంది ఇళ్లలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.
కీలక ఉన్నతాధికారి
ఈ వ్యవహారంలో ఓ కీలక ఉన్నతాధికారి, ఓ ప్రముఖ రాజకీయ నేత బంధువు పేర్లు వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. లక్షల రూపాయల బిల్లులకు సంబంధించిన దస్త్రం కదలాలంటే క్షేత్ర స్థాయి నుంచి పై వరకు పలువురు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ విభాగంలో ఏకంగా సంచాలకురాలితో పాటు సంయుక్త సంచాలకురాలే అక్రమాలకు పాల్పడడం వల్ల కిందిస్థాయి అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. డబ్బులకు ఆశపడి కొందరు... ఒత్తిళ్లకు లొంగిపోయి మరికొందరు ఈ అక్రమానికి సహకరించారు.