తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐఎంఎస్‌ కుంభకోణంలో కీలకపాత్రధారి ధనలక్ష్మి - ఈఎస్​ఐ కుంభకోణం వార్తలు

ఆమె ఓ సాధారణ ఫార్మసిస్టు.. కానీ వందల కోట్ల రూపాయల మందుల కొనుగోళ్ల వ్యవహారంలో కీలక పాత్రధారి. ఇన్సూరెన్స్‌ అండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) డైరెక్టరేట్‌లో ఫార్మసిస్టుగా పని చేసిన కె.ధనలక్ష్మి.. ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు ఔషధాలు, వైద్యపరికరాల సరఫరా, కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారంలో చక్రం తిప్పారని ఏసీబీ దర్యాప్తులో తేల్చింది.

esi-scam-in-ap
ఐఎంఎస్‌ కుంభకోణంలో కీలకపాత్రధారి ధనలక్ష్మి

By

Published : Jun 16, 2020, 7:43 AM IST

Updated : Jun 16, 2020, 8:19 AM IST

ఆంధ్రప్రదేశ్​లో 2016-19 మధ్య ఫార్మసిస్టుగా పనిచేసిన ధనలక్ష్మి వివిధ సంస్థల నుంచి ఖాళీ లెటర్‌హెడ్లు సేకరించి, మరికొన్ని సొంతంగా సృష్టించి.. దొంగ కొటేషన్లు వేసి ఖజానాను కొల్లగొట్టారని గుర్తించింది. ఆమె కోడలైన రావిళ్ల రవితేజశ్రీ పేరిట జెర్కన్‌ ఎంటర్‌ప్రైజస్‌ అనే సంస్థను స్థాపించి.. రూ.8 కోట్ల విలువైన ఔషధాలు, సర్జికల్‌ పరికరాల సరఫరా ఆర్డర్‌ను కట్టబెట్టారని పేర్కొంది. అప్పటి సూపరింటెండెంట్‌ ఈ.రమేష్‌బాబు, ఐఎంఎస్‌ డైరెక్టర్లు సీకే రమేష్‌కుమార్‌, డా.జి.విజయ్‌కుమార్‌, వివిధ సరఫరా సంస్థలతో కుమ్మక్కై ఆమె ఈ అక్రమాలకు తెరలేపారు. ఈ కేసులో అరెస్టైన నింధితుల రిమాండు రిపోర్టులో అనిశా ఈ వివరాల్ని ప్రస్తావించింది.

పక్కా వ్యూహంతో పక్కదారి

ఈఎస్‌ఐకు ఔషధాలు, వైద్యపరికరాల సరఫరా కోసం బహిరంగ టెండర్లు పిలిచేవారు కాదు. ఏవైనా సంస్థల ప్రతినిధులు.. ఐఎంఎస్‌ డైరెక్టర్లను కలిస్తే అన్నీ మాట్లాడుకున్న తర్వాత సరఫరాకు మౌఖికంగానే ఆదేశాలిచ్చేవారు. అనంతరం ఏయే ఔషధాలు, పరికరాల్ని ఎంత ధరకు కోట్‌ చేయాలో ధనలక్ష్మి ఆయా సంస్థల ప్రతినిధులకు చెప్పేవారు. తదునుగుణంగా వారు కొటేషన్లు వేసేవారు. సరఫరా ఒప్పందం తామనుకున్న సంస్థకే దక్కేలా మిగతా సంస్థలకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి వాటి పేరుతో ధనలక్ష్మే ఎక్కువ మొత్తం కోట్‌ చేసేవారు. సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల ప్రతినిధులు ఆమెకు కొనుగోలు ఆర్డర్‌లో 10 శాతాన్ని లంచంగా ఇచ్చేవారు. వీరేష్‌ ఫార్మా, తిరుమల మెడికల్‌ ఏజెన్సీ, రామ్‌ ఫార్మాస్యూటికల్స్‌ యజమానులైన తవ్వా రామలక్ష్మీ ప్రసన్నకుమార్‌, తెలుకపల్లి కార్తీక్‌, గొన్నె వెంకట సుబ్బారావు వారి వాంగ్మూలాల్లో ఈ వివరాలు వెల్లడించారు. ఇలా అక్రమ పద్ధతుల్లో ధనలక్ష్మి రూ.5.88 కోట్ల విలువైన 137 కొనుగోలు ఆర్డర్లు ఇప్పించినట్లు పరిశీలనలో తేలింది.

కోడలి సంస్థతో మరింత దోపిడీ

వివిధ సంస్థల పేరిట నకిలీ కొటేషన్లు సృష్టించి జెర్కన్‌ ఎంటర్‌ప్రైజస్‌ యజమాని, ధనలక్ష్మి కోడలైన రావిళ్ల రవితేజశ్రీ ఔషధాల సరఫరా కాంట్రాక్టులు దక్కించుకున్నారు. కనకదుర్గ ఎంటర్‌ప్రైజస్‌, స్టేటస్‌ ఫార్మా, రిషిత ఎంటర్‌ప్రైజస్‌, లైఫ్‌కేర్‌ ఫార్మా తదితర సంస్థల ప్రతినిధుల నుంచి ఖాళీ లెటర్‌ హెడ్లు సేకరించి.. వాటి పేరిట ఎక్కువ ధరలకు నకిలీ కొటేషన్లు వేసేవారు. ఎలాంటి ఇండెంట్లు లేకుండానే ఈ పద్ధతిలో భారీగా ఔషధాలు కొని ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. ధనలక్ష్మి కుమారుడు వరకూరి యశస్వి కూడా ఇతర సంస్థల పేరిట ఫోర్జరీ చేసిన కొటేషన్లు దాఖలు చేశారు. ధనలక్ష్మి తమ వద్ద ఎప్పటికప్పుడు ఖాళీ లెటర్‌హెడ్లు తీసుకునేవారని హైమా అసోసియేట్స్‌ భాగస్వాములు జ్యోతి ఫణికుమార్‌, శంకరవిశంకర్‌తోపాటు పలు సంస్థల ప్రతినిధులు వాంగ్మూలం ఇచ్చారు.

ఇదీ చదవండి:నవరత్నాలకే ప్రాధాన్యం.. రూ.2.30 లక్షల కోట్ల అంచనా..!

Last Updated : Jun 16, 2020, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details