తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈఎస్​ఐ కుంభకోణంలో కదులుతున్న డొంక...! - ESI SCAM UPDATE

ఈఎస్​ఐ మందుల కొనుగోలు కుంభకోణం కేసులో మరింత మంది అధికారుల అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది. కేసుకు సంబంధించి ఇప్పటికే 8 మందిని అనిశా అరెస్టు చేసింది. నిందితుల ఇళ్లల్లో దొరికిన నకిలీ బిల్లులు, బినామీ పత్రాలు దర్యాప్తు బృందాన్ని విస్తుపోయేలా చేశాయి. కుంభకోణంలో ఓమ్నీ మెడీ సంస్థ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించిన ఏసీబీ... చిట్టా బయటపెట్టే పనిలోపడింది.

ESI_SCAM_ ENQUIRY_IN_HYDERABAD_FULL_STORY

By

Published : Oct 2, 2019, 5:49 AM IST

Updated : Oct 2, 2019, 7:51 AM IST

ఈఎస్​ఐ కుంభకోణంలో కదులుతున్న డొంక...!

ఈఎస్​ఐ మందుల కొనుగోలు కుంభకోణం కేసు విచారణ ముమ్మరమైంది. కేసుతో సంబంధమున్న మరింతమంది అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తుల అరెస్టుకు కావాల్సిన ఆధారాలను ఏసీబీ సేకరించే పనిలోపడింది. రూ.10 కోట్ల కంటే ఎక్కువ కుంభకోణం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు కలిసి ఏ అంచనాలు, అనుమతులు లేకుండానే యథేచ్ఛగా దోపిడీకి పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. కుంభకోణంలో సూత్రధారి ఒమ్నీ మెడీ ఎండీ శ్రీహరిబాబు సహా ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాల్లో లెక్కలేనన్ని ఖాళీ ఇండెంట్లు, ఇతర అధికారిక ధ్రువపత్రాలు గుట్టలుగుట్టలుగా దొరకడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు రెండు డిస్పెన్సరీల ద్వారా జరిగిన అవకతవకలు విశ్లేషించగా.. దాదాపు రూ.10కోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల ద్వారా జరిగిన అక్రమాలు విశ్లేషిస్తే ఆ విలువ పదుల రెట్లు ఉంటుందని అనిశా భావిస్తోంది.

కుంభకోణం జరిగిందిలా...

ప్రభుత్వం నిధులు కేటాయించగానే అధికారులు ఆ విషయాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఫలానా డిస్పెన్సరీకి లక్షల మందులు కావాలని తమవద్ద ఉన్న ఇండెంట్‌పై రాసి వారే సంతకం పెట్టుకుంటారు. ఒక్కో ఇండెంట్‌పై రూ.50లక్షల వరకు విలువైన మందుల పద్దు రాసినట్లు గుర్తించారు. వాటికి అధికారులు వెంటనే ఆమోద ముద్రవేసి ఫలానాసంస్థ నుంచి మందుల కొనుగోలు చేయాలని అనుమతిస్తారు. అనంతరం మందుల సరఫరా చేసినట్లు వాటిని డిస్పెన్సరీలకు పంపిణీ జరిపినట్లు రికార్డుల్లో నమోదుచేస్తారు. ఆ మందులు స్వీకరించినట్లు డిస్పెన్సరీ నిర్వాహకులను బెదిరించి సంతకాలు తీసుకుంటారు.

కీలక ఆధారాలు సేకరించిన అనిశా

ఇండెంట్లపై పోర్జరీ సంతకాలు పెట్టినట్లు బలమైన ఆధారాలు సేకరించారు. కుంభకోణంలో ఓమ్నీ మెడీ ఎండీ హరిబాబు సహా దాదాపు 15ఏళ్లుగా మందుల కొనుగోళ్లలో బాబ్జీ కీలకపాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. ఆరోపణలు వచ్చినా రెండు రాష్ట్రాల్లోని ఏఎంఎస్​ మందుల కొనుగోళ్లలో అతని హవా కొనసాగినట్లు దర్యాప్తులో తేలింది. బాబ్జీ కోసం హైదరాబాద్ ఐఎంఎస్ కార్యాలయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని... అధికారులే ఆయనకు మర్యాద ఇచ్చేవారని విచారణలో నిగ్గుతేల్చారు.

కోట్లు వెచ్చించి మందుల కొనుగోలు జరుపుతున్న సంస్థలో.... అంతర్గత నిఘా ఏమైందని అనిశా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదేదో ఒకరిద్దరు అధికారులు కలిసి చేసిన అక్రమం కాదని... కొన్నేళ్లలో పదులసంఖ్యలో ఉద్యోగులు, ప్రైవేట్‌వ్యక్తులు దోపిడీకి పాల్పడుతున్నా... ఎందుకు పట్టుకోలేకపోయారని అంతర్గత తనిఖీలు ఎందుకు జరపలేదన్న విషయంపై ఏసీబీ ఆరాతీస్తోంది.

ఇవీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

Last Updated : Oct 2, 2019, 7:51 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details