బీమా వైద్య సేవల విభాగం మందుల కొనుగోలు కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఈ వ్యవహారంలో నగరంలోని మరో నాలుగు చోట్ల అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. వైద్య శిబిరాల నిర్వాహణ పేరుతో భారీగా సొమ్ము దండుకున్న వ్యవహారాన్ని మరింత లోతుగా విచారిస్తున్నారు.
తెర ముందుకు కొత్త పేరు...
భూపాలపల్లి జిల్లా నందిగామకు చెందిన అరవింద్‌రెడ్డితో కుమ్మక్కై ఐఎంఎస్ అధికారులు అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్ శివారులో 17 శాఖలున్న ఓ ప్రముఖ ఔషధ తయారీ సంస్థలోని కార్మికులకు ఈఎస్‌ఐ ద్వారా వైద్య సేవలందించేందుకు అరవిందరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఐఎంఎస్ ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. కార్మికుల క్యాంపుల్లో వైద్య శిబిరాలు నిర్వహించినట్లు చూపించడం ద్వారా డబ్బు దండుకోవడం ప్రారంభించాడు. ఎంత మొత్తంలో దారి మళ్లించాడనేది తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అరవింద్‌రెడ్డి నివాసంలో ఈఎస్‌ఐ ముద్రతో కూడిన ఔషధాలు లభించాయి. వాటిలో చాలా వరకు మందులకు కాలం చెల్లినట్టు బయటపడింది.