తెలంగాణ

telangana

ETV Bharat / state

చికిత్స పొందుతున్న ఈఎస్​ఐ నిందితురాలు పద్మ - నిద్రమాత్రలు

కార్మిక బీమా వైద్య సేవల సంస్థ మందుల కొనుగోలు కుంభకోణంలో నిందితురాలు పద్మ చంచల్‌గూడ జైల్లో ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. రిమాండ్‌ ఖైదీగా జైల్లో ఉంటున్న ఆమె నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. జైలు అధికారులు అప్రమత్తమై పద్మను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.

చికిత్స పొందుతున్న ఈఎస్​ఐ నిందితురాలు పద్మ

By

Published : Oct 20, 2019, 6:49 AM IST

Updated : Oct 20, 2019, 7:44 AM IST

చికిత్స పొందుతున్న ఈఎస్​ఐ నిందితురాలు పద్మ

చంచల్‌గూడ జైల్లో ఆత్మహత్య యత్నం చేసిన మందుల కొనుగోలు కేసులో నిందితురాలు ఈఎస్​ఐ సంయుక్త సంచాలకులు పద్మ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుంభకోణం వ్యవహారంలో ఆమె గత నెల 27న అరెస్టయ్యారు. జైలుకు వచ్చినప్పటి నుంచి పద్మ ముభావంగా ఉంటోందని జైలు అధికారులు తెలిపారు. తనకు నిద్ర సరిగ్గా పట్టడం లేదని... ఆరోగ్య సమస్యలున్నాయని మహిళా జైలు అధికారులకు తెలపగా... ఆమెకు అవసరమైన మందులు ఇస్తున్నారు. తనకు అనారోగ్యంగా ఉందని వైద్యులు సూచించిన మందులు కావాలని ఆమె కోరింది. విషయాన్ని అధికారులు ఆమె కుటుంబసభ్యులకు తెలిపారు.

నిద్రమాత్రలు వేసుకొని:

పద్మను ములాఖాత్‌లో కలుసుకునేందుకు.. కుటుంబసభ్యులు జైలుకు వచ్చారు. వారు తమ వెంట మందులతో పాటు నాలుగు నిద్రమాత్రలు తీసుకువచ్చారు. వారిని చూసిన వెంటనే పద్మ భావోద్వేగానికి లోనయ్యారు. కొద్దిసేపు వారితో మాట్లాడి నిమిషాల వ్యవధిలోనే తన వద్ద ఉన్న నిద్రమాత్రలు మింగారు. దీనితో పద్మ అక్కడే కిందకు ఒరిగిపోయారు. జైలు సిబ్బంది అక్కడే ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనతో కుటుంబసభ్యులు నిద్రమాత్రలు తెచ్చినా... జైలు సిబ్బంది వాటిని తీసుకొని మోతాదు ప్రకారం ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా ఆమె వద్ద నుంచి మందులు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏ విధంగా అనుమతిచ్చారు:

నిద్రమాత్రలు నేరుగా పద్మ చేతికి కుటుంబసభ్యులు ఇచ్చిన క్రమంలో అధికారులు ఏ విధంగా అనుమతించారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఆత్మహత్యయత్నం చేయడం వల్ల ఉలిక్కిపడ్డ జైలు అధికారులు ఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: ముగిసిన హుజూర్​నగర్​ ఉపఎన్నికల ప్రచారం

Last Updated : Oct 20, 2019, 7:44 AM IST

ABOUT THE AUTHOR

...view details