అన్నదాతలు తొలిసారిగా భూక్షేత్రంలో నాగలి పట్టి దున్నే ముందు భూమి పూజ చేస్తారు. తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం ప్రకారం..... వర్ష రుతువులో జేష్ఠ్య పౌర్ణమి రోజున.... పూజలు నిర్వహిస్తారు. ఆ పున్నమి రోజును ఏరువాక పర్వదినంగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో.... ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు ప్రారంభిస్తారు. ఆడపడుచులు పుట్టింటికి వచ్చి ఆనందంగా గడుపుతారు.
ఎడ్లను అలంకరిస్తారు
ఏరువాక పర్వదినాన కర్షకుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఎడ్లకు శుభ్రంగా స్నానం చేయించి... కొమ్ములకు రంగులు పూస్తారు. మెడ, కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. వాటికి పొంగలి ఆహారంగా పెడతారు. అనంతరం రైతులు సామూహికంగా పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు. పున్నమి నాడు పూజలు చేయడం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నదాతలు విశ్వసిస్తారు.