Errabelli sent post card to Modi to cancel GST on handloom: చేనేతపై విధించిన జీఎస్‌టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఆయన తరహాలోనే చేనేత రంగంపై విధించిన 5 శాతం జీఎస్‌టీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖతో పాటు పోస్టుకార్డును సైతం రాశారు.
తన స్వహస్తాలతో రాసిన ఈ పోస్టు కార్డును మంత్రినే పోస్టు చేశారు. ఒకవైపు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమర్థవంతమైన పాలన ద్వారా చేనేతలకు ప్రోత్సాహకాలు ఇచ్చి కార్మికులను ఆదుకుంటుంటే.. మరోవైపు, కేంద్రం మాత్రం నడ్డి విరిచేలా 5 శాతం జీఎస్‌టీ విధించడం చాలా అన్యాయం అని ఆక్షేపించారు. రాష్ట్రంలో చేనేతలకు చేయూత, బీమా వంటి వినూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. కేంద్రం ప్రభుత్వం చేనేత కార్మికులపై కక్ష కట్టిందని విమర్శించారు. దేశంలో కీలక వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధారపడిన రంగం చేనేత అని గుర్తు చేశారు. అలాగే, భారతదేశంలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా చేనేత రంగంపై విధించిన జీఎస్‌టీ ఇప్పటికైనా వెంటనే రద్దు చేయాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.