తెలంగాణ

telangana

ETV Bharat / state

Errabelli Dayakar rao: 'కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి' - errabelli comments on kishan reddy

కేంద్రమంత్రిగా తెలంగాణకు కిషన్​ రెడ్డి ఏం చేశారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా రాలేదని ఆరోపించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కిషన్​ రెడ్డి.. తెరాస పాలనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎర్రబెల్లి తెలంగాణ భవన్​లో మాట్లాడారు.

Errabelli Dayakar rao
ఎర్రబెల్లి దయాకర్​ రావు

By

Published : Aug 21, 2021, 1:03 PM IST

కేంద్రం నుంచి వచ్చే వాటా కాకుండా అధికంగా తెలంగాణకు ఏం సాయం చేశారో గణాంకాలతో సహా వెల్లడించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ప్రధాని మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని విమర్శించారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కేంద్రం ప్రశంసించిందని ఎర్రబెల్లి గుర్తుచేశారు. దీనికి కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయటంపై కిషన్ రెడ్డి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా రెండేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారు: మంత్రి ఎర్రబెల్లి

కేబినెట్​ మంత్రి స్థానంలో ఉండి కిషన్ రెడ్డి హుందాగా ప్రవర్తించాలి. చిల్లర రాజకీయలు తగదు. పర్యాటక రంగంలో తెలంగాణ వెనుకబడింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పాలి. -ఎర్రబెల్లి దయాకర్​ రావు, పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి

భాజపా అంటేనే మోసం చేసి అధికారంలోకి వచ్చే పార్టీ అని ప్రజల్లో భావన ఉందని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. కేంద్రానికి వివిధ సుంకాల రూపంలో ఇప్పటివరకు రూ. 2 లక్షల 70వేల కోట్లు కట్టామని చెప్పారు. కానీ రాష్ట్రానికి లక్షా 50 వేల కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా రాలేదని ఎద్దేవా చేశారు. భాజపా పాలిత ప్రాంతాల్లో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details