Errabelli comments on central Govt : మిషన్ భగీరథకు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి పార్లమెంట్ సాక్షిగా మరోమారు బట్టబయలైందని గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆక్షేపించారు. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ వాటర్ సప్లయ్ కార్యక్రమం కింద నాలుగేళ్లలో రూ.2,455 కోట్లు కేటాయించి రూ.311 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారన్న ఎర్రబెల్లి... అందులో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.
తెలంగాణ పథకాలు కాపీ..
మిషన్ భగీరథ పథకాన్ని అభినందిస్తూ అనేక అవార్డులను ఇచ్చిన కేంద్రం... కాపీ కొట్టి జల్ జీవన్ మిషన్ పథకాన్ని జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిందన్నారు. అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ తరహా పథకాన్ని అమలు చేస్తున్నాయన్న మంత్రి......రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో పనులు మొదలు పెట్టిన దశలోనే వందల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష మానుకొని తగిన నిధులు అందించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు