తెలంగాణ

telangana

ETV Bharat / state

పింఛను దారులకు శుభవార్త.. ప్రతి నెలాఖరుకు ఖాతాల్లో నగదు జమ

EPFO on Pension: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన పింఛనుదారులకు శుభవార్త చెప్పింది. ప్రతి నెలా చివరి పని దినం రోజున... ఆ నెలకు సంబంధించిన పింఛను సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 80 లక్షల మంది పింఛను దారులకు లబ్ది చేకూరనుంది.

EPFO on Pension
పింఛను దారులకు శుభవార్త

By

Published : Jan 17, 2022, 7:09 AM IST

EPFO on Pension: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) పింఛనుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రతి నెలా చివరి పని దినం రోజున ఆ నెలకు సంబంధించిన పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పింఛను విభాగం ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ విశాల్‌ అగర్వాల్‌.. ఈపీఎఫ్‌ క్షేత్ర స్థాయి కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు.

పింఛను పంపిణీ చేసే బ్యాంకులకు విధివిధానాలను జారీ చేయాలని సూచించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 80 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. పింఛనుదారులకు పింఛను చెల్లించడానికి కొన్ని బ్యాంకులతో ఈపీఎఫ్‌వో ఒప్పందాలు చేసుకుంది. దీని ప్రకారం ప్రతి నెలా 10వ తేదీ నాటికి అంతకు ముందు నెలకు సంబంధించిన పింఛనును బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. కొన్ని బ్యాంకులు 7వ తేదీన జమ చేస్తే మరికొన్ని 10 నాటికి ఇచ్చేవి.

నాలుగేళ్ల క్రితం..

ఆర్‌బీఐ నిబంధనల మేరకు.. ప్రతి నెలా మొదటి పని దినం రోజునగానీ, గరిష్ఠంగా 5వ తేదీ నాటికిగానీ పింఛను ఖాతాలో జమ చేయాలని ఈపీఎఫ్‌వో నాలుగేళ్ల క్రితం బ్యాంకులకు సూచించింది. అయితే, ప్రాంతీయ పీఎఫ్‌ కార్యాలయాల నుంచి పింఛను చెల్లింపు బిల్లులు సకాలంలో అందకపోవడంతో కొన్ని బ్యాంకుల్లో గడువు తేదీ దాటినా చెల్లింపులు జరగడం లేదని ఈపీఎఫ్‌వో దృష్టికి వచ్చింది. ఈ కారణంగా పింఛనుదారులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ఈపీఎఫ్‌వో.. ప్రతి నెలా చివరి పని దినం రోజున వారి బ్యాంకు ఖాతాల్లో ఆ నెలకు సంబంధించిన పింఛను జమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజా నిబంధనల మేరకు పింఛను జమ అయ్యే తేదీకి రెండు రోజుల ముందుగానే బ్యాంకులకు బిల్లులు పంపించాలని సంబంధిత క్షేత్రస్థాయి కార్యాలయాలకు సూచించింది.

ఇదీ చూడండి:Telangana Cabinet: కొవిడ్ పరిస్థితులపై నేడు కేబినెట్ భేటీ

ABOUT THE AUTHOR

...view details