మేడ్చల్ 3,327, సంగారెడ్డి 1,149, రంగారెడ్డి 1,089... రాష్ట్ర పారిశ్రామిక అనుమతుల స్వీయ ధ్రువీకరణ విధానం(టీఎస్‌ఐపాస్)లో గత ఆరేళ్ల కాలంలో అనుమతులు పొందిన పరిశ్రమలివి. అదే సమయంలో నారాయణపేట జిల్లాలో 11, ములుగు జిల్లాలో 15 మాత్రమే అనుమతులు పొందాయి. దీన్నిబట్టి మారుమూల జిల్లాల వైపు పారిశ్రామిక వేత్తలు మొగ్గుచూపడం లేదనేది సుస్పష్టం. ఇది టీఎస్‌ఐపాస్ ఏర్పాటు లక్ష్యానికి విఘాతం కల్గిస్తుండగా, మౌలిక వసతుల కొరత, రవాణా సౌకర్యాల లేమి వంటివి ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు ప్రతిబంధకాలుగా ఉన్నట్టు పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఫలితమివ్వని వికేంద్రీకరణ
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వికేంద్రీకరణ లక్ష్యంతో టీఎస్‌ఐపాస్ విధానానికి శ్రీకారం చుట్టింది. 33 జిల్లాల్లోనూ పరిశ్రమలు స్థాపించేలా 1.57 లక్షల ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటుచేసి జాతీయ రహదారులు సహా ఇతర మౌలిక వసతులను విస్తరించింది. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, వలసలకు అడ్డుకట్టవేయడం, కాలుష్య నివారణ, నగరాలపై ఒత్తిడిని తగ్గించడం వంటి లక్ష్యాలతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మారుమూల జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించాలంటూ పారిశ్రామికవేత్తలను పదేపదే కోరుతున్నారు. అందులో భాగంగానే కేరళకు చెందిన కైటెక్స్ సంస్థ హైదరాబాద్‌పై ఆసక్తి చూపినప్పటికీ, దాన్ని నేరుగా వరంగల్‌లోని జౌళి పార్కు వైపు మళ్లించారు. మొత్తంగా పారిశ్రామిక వర్గాలు నగరాలు, పట్టణాలకు సమీపంలో పరిశ్రమలు స్థాపించేందుకే మొగ్గుచూపుతుండటంతో వికేంద్రీకరణ లక్ష్యం నెరవేరడం లేదు.
పెట్టుబడుల్లో రంగారెడ్డిదే అగ్రస్థానం
రంగారెడ్డి జిల్లా రూ.67,431 కోట్ల పెట్టుబడులతో, 8,81,050 మందికి ఉపాధి కల్పించడం ద్వారా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది. పెట్టుబడుల్లో నల్గొండ రూ.27,061 కోట్లు, భద్రాద్రి(రూ.21,917 కోట్లు), పెద్దపల్లి (రూ. 13,644 కోట్లు), మేడ్చల్ (రూ.13,593 కోట్లు), సంగారెడ్డి (రూ.12,544 కోట్లు) జిల్లాలు ముందున్నాయి. ఇందులోనూ ములుగు (రూ.3 కోట్లు), నారాయణపేట (రూ.7 కోట్లు) జిల్లాలు వెనుకంజలో నిలిచాయి.