Telangana government school: రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది వేల ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమ బోధన కొనసాగుతోంది. అయినా చాలా పాఠశాలల్లో పేరుకే ఇంగ్లీషు మీడియం అన్నట్లుగా పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచి సర్కార్ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 26 వేల సాధారణ ప్రభుత్వ బడులున్నాయి. వందల ఉన్నత పాఠశాలల్లో సక్సెస్ స్కూళ్ల పేరిట ఉమ్మడి రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం సెక్షన్లు ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత 2016లో ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమ బోధనకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా ఇప్పటి వరకు 8 వేల వరకు బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధన సాగుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అందులో 4 వేల ప్రాథమిక పాఠశాలలు కాగా మిగిలినవి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు.
చట్టం వస్తే?
ఇప్పటివరకు విద్యాకమిటీలు అడిగిన చోట...ఆంగ్ల మాధ్యమం బోధిస్తామని ఉపాధ్యాయులు అంగీకరించిన స్కూళ్లలో ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఆ తర్వాత ఉపాధ్యాయులు బదిలీ అయినప్పుడు మళ్లీ వారిని ఆంగ్ల మాధ్యమం ఉన్న పాఠశాలలకు పంపలేదు. దాంతో పేరుకే ఆంగ్ల మాధ్యమం ఉన్నట్లు చాలా చోట్ల పరిస్థితి మారింది. చట్టం అమలు చేస్తే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు(టీఆర్‌టీ) ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసి...నెగ్గిన వారే బోధించాలని నిబంధన పెట్టే అవకాశం ఉంది. టీఆర్‌టీలో ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కూడా పరీక్షించేలా వ్యాసరూప ప్రశ్నలు కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఉన్న వారిని తెలుగు? ఆంగ్ల మాధ్యమం? ఏదో ఒకటి ఎంచుకునేలా చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఆంగ్ల మాధ్యమం? తెలుగు మాధ్యమం? బడులని ప్రత్యేకంగా లేవు. కొత్త చట్టం తర్వాత ఆ విషయాన్ని స్పష్టంచేయాల్సి ఉంటుంది.
సమర్ధంగా అమలు చేస్తేనే..