First Phase Engineering Seats Allotment in Telangana : రాష్ట్రంలో ఇంజినీరింగ్‌లో మొదటి విడతలో 85.48 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 82,666 సీట్ల కేటాయింపు కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలోనే ధ్రువపత్రాల పరిశీలనకు 76,821 మంది హాజరయ్యారు. ఇవాళ మొదటి విడతలో 70,665 సీట్ల కేటాయింపు పూర్తయింది. మరో 12,001 సీట్లు మిగిలాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,576 సీట్లు కేటాయించారు.
Engineering Seat Allotment in Telangana : మూడు యూనివర్సిటీల్లో, 28 ప్రైవేట్ కాలేజీల్లో సీట్లన్నీ మొదటి విడతలో నిండిపోయాయి. కంప్యూటర్సైన్స్కు సంబంధించిన కోర్సుల్లో 94.20 శాతం సీట్ల కేటాయింపు పూర్తయింది. కోర్ గ్రూప్‌లకు సంబంధించి ఈ ఏడాది కూడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. ట్రిపుల్‌ఈలో 58.38 శాతం, సివిల్‌లో 44.76 శాతం, మెకానికల్‌లో 38.50 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ వాకాటి కరుణ తెలిపారు. మరోవైపు ఈ నెల 24 నుంచి రెండో విడత సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 4 నుంచి తుది విడత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
ఇటీవలే ఇంజినీరింగ్ విద్యలో మరో 14,565 సీట్లకు ప్రభుత్వం అనుమతిని ఇస్తూ ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తద్వారా వివిధ కాలేజీల్లో కొత్తగా 7,635 అదనపు సీట్లను మంజూరు చేసింది. ఇంజినీరింగ్ విద్యలో కీలక బ్రాంచ్‌లు అయిన సివిల్, మెకానికల్, ట్రిపుల్‌ఈ వంటి కోర్ గ్రూపుల్లో 6,930 సీట్లను తగ్గించుకొని.. అదే సంఖ్యలో కంప్యూటర్ కోర్సుల్లో పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
మరోవైపు సీట్ల పెంపు వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో ప్రభుత్వంపై.. ఏటా రూ.27.39 కోట్ల అదనపు వ్యయభారం పడనుంది. ఇటీవలే 86,106 సీట్లకు జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. తాజా పెంపుతో తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 55 కాలేజీల్లో 45 కోర్సుల్లో 1,00,671 సీట్లకు అనుమతి వచ్చింది.