తెలంగాణ

telangana

ETV Bharat / state

పరీక్ష కేంద్రాలను వారే ఎంపిక చేసుకోవచ్చు: జేఎన్​టీయూ - engineering final year students can opt their examination centre

ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులు కోరుకున్న చోటు.. సొంతూరికి దగ్గర్లోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని జేఎన్​టీయూ నిర్ణయించింది. సెప్టెంబరులోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్న జేఎన్‌టీయూ విద్యార్థులకు ఐచ్ఛికాలు ఇవ్వాలని నిర్ణయించింది.

engineering final year students can opt their examination centre
పరీక్ష కేంద్రాలను వారే ఎంపిక చేసుకోవచ్చు: జేఎన్​టీయూ

By

Published : Jul 21, 2020, 7:19 AM IST

ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు జేఎన్‌టీయూ సన్నద్ధమవుతోంది. విద్యార్థులు కోరుకున్న చోటు..సొంతూరికి దగ్గర్లోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సెప్టెంబరు ఆఖరు నాటికి చివరి ఏడాది పరీక్షలు పూర్తి చేయాలని ఇటీవల యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా సెప్టెంబరులోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్న జేఎన్‌టీయూ విద్యార్థులకు ఐచ్ఛికాలు ఇవ్వాలని నిర్ణయించింది.

'ప్రస్తుతం విద్యార్థులంతా సొంతూళ్లలో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో వర్సిటీ నిర్ణయించిన కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాసే వీలుండకపోవచ్చు. అందుకే విద్యార్థి ఉన్న ప్రాంతానికి దగ్గర్లోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించాలని నిర్ణయించాం.

ఇందులో భాగంగా విద్యార్థులు తామున్న ప్రాంతానికి దగ్గర్లోని రెండు కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకదాన్ని వర్సిటీ కేటాయిస్తుంది. దగ్గర్లో ఇంజినీరింగ్‌ కళాశాల లేనిపక్షంలో ఫార్మసీ కళాశాలల్నీ కేంద్రంగా ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తాం.

కేంద్రాల ఎంపిక పూర్తయిన వెంటనే పరీక్షల ప్రణాళిక విడుదల చేస్తాం. ఈ విషయమై త్వరలో కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేస్తాం' అని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ వివరించారు.

రోజుకో పాఠ్యాంశం.. గంటపాటు బోధన!

ఇంజినీరింగ్‌ విద్యా సంవత్సరాన్ని ఆగస్టు 17 నుంచి ప్రారంభించేందుకు జేఎన్‌టీయూ సిద్ధమవుతోంది. ఆన్‌లైన్‌ బోధన అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రయోగాత్మకంగా రెండు, మూడు, నాలుగో ఏడాది విద్యార్థులకు రోజుకో సబ్జెక్టును, గంటపాటు బోధించేలా కళాశాలలను సన్నద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు జారీ చేయనుంది.

ప్రయోగాత్మకంగా వెబినార్‌

సన్నద్ధతలో భాగంగా ఈ నెలాఖరు నుంచి వారంపాటు రోజుకో పాఠ్యాంశంపై గంటపాటు ఫ్యాకల్టీతో వెబినార్‌ నిర్వహిస్తారు. ‘ప్రతి కళాశాల తరఫున ఈ తరహా బోధన కొనసాగించి లోపాలు గుర్తించి, క్రమంగా వాటిని సవరించుకుంటూ వెళ్తాం. ఆగస్టు 17 నాటికి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాం’ అని వర్సిటీ వర్గాలు తెలిపాయి. అంతర్జాల సదుపాయం లేని విద్యార్థులు సమీపంలోని ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్లి ఆన్‌లైన్‌ పాఠాలు వినే వెసులుబాటు కల్పిస్తామని వెల్లడించాయి.

ఇదీ చూడండి:కోవాక్జిన్​ క్లినికల్‌ ట్రయల్స్‌ తొలిదశ విజయవంతం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details