ఎంసెట్ కన్వీనర్ కోటాలో మొత్తం 50,844 సీట్లు మాత్రమే భర్తీ అయ్యే అవకాశం ఉంది. చివరి విడత కౌన్సెలింగ్ సీట్లను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు గురువారం మధ్యాహ్నం కేటాయించారు. సీట్లు పొందిన వారు అందరూ చేరినా ఇంకా కన్వీనర్ కోటాలో 19,276 బీటెక్ సీట్లు మిగిలిపోనున్నాయి. బీఫార్మసీలో 3,794 సీట్లు మిగిలిపోయాయి.
బీటెక్ తుది విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా 2,357 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. సీట్లు పొందిన వారు వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి ఈ నెల 17వ తేదీలోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. అంతేకాకుండా ఫొటోస్టాట్ పత్రాలతోపాటు ఒరిజినల్ టీసీ ఆయా కళాశాలల్లో సమర్పించాలన్నారు. లేకుంటే సీటు రద్దు అవుతుందని తెలిపారు. అయితే సీట్లు పొందిన వారందరూ కళాశాలల్లో చేరరని, అలాంటి వారు సుమారు అయిదు వేల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక యాజమాన్య కోటా కింద 30 వేల సీట్లుండగా...అందులో 16 వేల నుంచి 20 వేల వరకు భర్తీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రైవేట్‌కు స్పాట్ ప్రవేశాలు
రాష్ట్రంలో 14 ప్రభుత్వ, 167 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా 12 ప్రభుత్వ, మరో 26 ప్రైవేట్ కళాశాలల్లో అన్నీ సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలో అన్ని సీట్లు భర్తీ అయిన కళాశాలలు 48 ఉండగా...చివరి విడతకు వచ్చే సరికి ఆ సంఖ్య 38కి తగ్గిపోవడం గమనార్హం. అంటే తొలి విడతలో సీట్లు పొందిన వారు మెరుగైన సీటు కోసం మరో కళాశాలలో చేరటంతో ఆ 10 కళాశాలల్లో సీట్లు 100 శాతం భర్తీ కాకపోయి ఉండొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మూడు కళాశాలల్లో ఒక్కరూ ప్రవేశాలు పొందలేదు. ప్రైవేట్ కళాశాలల్లో మిగిలిన సీట్లను స్పాట్ ప్రవేశాల్లో భర్తీ చేసుకోవచ్చు. అందుకు ఈ నెల 14న మార్గదర్శకాలను జారీ చేయనున్నారు.
బీటెక్ సీట్ల భర్తీ పరిస్థితి ఇదీ
*కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినవారు: 89,572
*ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనవారు: 58,142
*మొత్తం బీటెక్ కన్వీనర్ కోటా సీట్లు: 70,120
*కేటాయించిన సీట్లు: 50,844
*మిగిలినవి: 19,276
బీఫార్మసీలో పరిస్థితి
*మొత్తం సీట్లు: 3,959
*సీట్లు పొందిన వారు: 165(4.2 శాతం)
*మిగిలినవి: 3,794
(గమనిక:మిగిలిన సీట్లను ఎంసెట్ అగ్రికల్చర్‌లో ర్యాంకు పొందిన వారికి కేటాయిస్తారు. ఆ కౌన్సెలింగ్ త్వరలో నిర్వహిస్తారు)