Amit Arora In Delhi Liquor Case: దిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు చేసిన అమిత్ అరోరాను ఏడు రోజుల ఎన్ఫోర్స్మెంట్ కస్టడీకి రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు అనుమతించింది. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సన్నిహితుడైన అమిత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ.. 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కోర్టు ఏడు రోజులకు అనుమతించింది. దిల్లీ మద్యం స్కామ్‌లో అమిత్ అరోరా పాత్రను కోర్టుకు తెలిపిన అధికారులు ఆయన రూ. 2.50 కోట్లు లంచం వసూలు చేశాడని తెలిపింది.
ఇప్పటికే ఈడీ తనను 22 సార్లు ప్రశ్నించిందని తెలిపిన అమిత్ .. విజయ్ నాయర్, సిసోదియాను ఎప్పుడూ కలవలేదని కోర్టుకు తెలిపారు. దీంతో 22సార్లు ప్రశ్నించాక కస్టడీ అవసరం ఏంటని ఈడీని కోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఈడీ.. మూడుసార్లు వాంగ్మూలం నమోదు చేశామని సమగ్ర దర్యాప్తు కోసమే కస్టడీకి కోరుతున్నట్లు తెలిపింది. దీంతో న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. గురుగ్రామ్ లోని బుడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న అమిత్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
తాజా అరెస్టుతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మొత్తం నలుగురిని అరెస్టు చేసింది. మరో ఇద్దరిని సీబీఐ కస్టడీ నుంచి అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇటీవల మూడువేల పేజీలతో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో సమీర్‌ను ఏ1గా పేర్కొన్న దర్యాప్తు వర్గాలు.. సిసోదియా పేరు మాత్రం చేర్చలేదు. అటు సీబీఐ కూడా ఎఫ్ఐఆర్లో సిసోదియా పేరును చేర్చగా.. ఛార్జ్‌షీట్‌లో మాత్రం నమోదు చేయలేదు.