ED Attach loan apps cash: ఎంతో మంది జీవితాలతో చెలగాటమాడుతున్న రుణయాప్‌ల కేసుల్లో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా నాలుగు ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు సంబంధించిన 155 బ్యాంకు ఖాతాల్లోని 86.65 కోట్ల రూపాయలను జప్తు చేసింది. కుడోస్, ఏస్‌మనీ, రినో, పయోనీర్ ఫినాన్స్ లిమిటెడ్‌లకు చెందిన నగదు జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
గతంలో కుడోస్ కంపెనీకు చెందిన రూ.72.32 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. ఇప్పటి వరకు ఈ నాలుగు కంపెనీలకు సంబంధించి రూ.158.97 కోట్లు జప్తు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ నాలుగు కంపెనీలు 940.46 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా చైనీస్ కంపెనీలతో కుమ్మక్కై అమాయకులను మోసం చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.