Data Theft Case Updates : దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టయిన నిందితులను బుధవారం రోజున సైబరాబాద్ సిట్ పోలీసులు విచారించారు. ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఐదుగురు నిందితులు జియా ఉల్ రెహ్మాన్‌తో పాటు మరో నలుగురిని సిట్ బృందం విచారించింది.
ED inquiry on Data theft case : ఈ ముఠా తరహాలో ఇంకా ఎన్ని ముఠాలు ఉన్నాయి..? దేశంలో ఎక్కడెక్కడ ఈ ముఠాలున్నాయి..? వ్యక్తిగత డేటా ఎవరెవరికి విక్రయిస్తున్నారు..? కోట్ల మంది డేటా ఎలా పొందగలిగారు..? సున్నితమైన రక్షణ ఉద్యోగుల డేటా ఎలా బయటకొచ్చిందియయ? కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఎలా పని చేస్తున్నారు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సిట్ అధికారులు నిందితులందరినీ కలిపి విచారిస్తున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 1న వీరి ఐదు రోజుల కస్టడీ ముగియనుంది. కస్టడీలో భాగంగా నేడు మూడో రోజు నిందితులను విచారించనున్నారు. జస్ట్ డయల్ నిర్వాహకులకు కూడా నోటీసులిచ్చి.. వారినీ ప్రశ్నించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం.
కేసు నమోదు చేసిన ఈడీ..: మరోవైపు ఈ కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేసింది. డేటా చోరీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అందులో రక్షణ రంగ అధికారుల కీలక సమాచారం సైతం చోరీ అయినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఖాతా, క్రెడిట్, పాన్ కార్డు కోసం ఇచ్చిన డేటాను లీక్ చేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది.