ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశీయ బొమ్మల తయారీ పరిశ్రమలు ఊపందుకుంటున్నాయి. ఈ పరిణామాన్ని అందిపుచ్చుకొని ఈ రంగంలో దాదాపు రూ.2 వేల కోట్ల వార్షిక మార్కెట్‌ను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ అధికారులు ఆ శాఖ మంత్రి కేటీఆర్‌కు కీలక ప్రతిపాదనలు చేశారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయాలను వెల్లడించనుంది. భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశం ఉంది.
బొమ్మల తయారీకి ముందుకొచ్చిన పలు సంస్థలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్త పారిశ్రామిక విధానం(టీఎస్‌ఐపాస్) చేపట్టగా... ఇందులో పలు సంస్థలు బొమ్మల తయారీకి ముందుకొచ్చాయి. యూనివర్సల్, బట్టర్‌ఫ్లై పరిశ్రమలు ప్రారంభమై ఇప్పటికే ఉత్పత్తులు చేపట్టగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించిన తర్వాత పరిశ్రమల స్థాపనకు టీఎస్‌ఐపాస్‌కు 120కిపైగా సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగం ప్రాధాన్యం గుర్తించి పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, నోడల్ అధికారిని నియమించింది. ఈ విభాగం రాష్ట్రవ్యాప్తంగా బొమ్మల తయారీ అవకాశాలపై సర్వే నిర్వహించింది. నిర్మల్‌లో చిత్రాలతోపాటు చెక్కబొమ్మల తయారీ అవుతుండగా.. అక్కడ బొమ్మల తయారీని ముమ్మరం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏటికొప్పాక చెక్కబొమ్మల తయారీలో సంగారెడ్డి జిల్లా బొంతపల్లి కళాకారులు పాల్గొనేవారు. రాష్ట్ర విభజన అనంతరం వారు సొంతంగా బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్, బొంతపల్లిలో సమూహాలను ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నారు.
ముడిసరకు లభ్యత
టెడ్డీబేర్, వివిధ జంతువులు, వస్తువుల ఆకారాలతో కూడిన తేలిక రకం (సాఫ్ట్)బొమ్మలకు పత్తి అవసరం. రాష్ట్రం నాణ్యమైన పత్తిసాగులో అగ్రస్థానంలో ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పెద్దఎత్తున బొమ్మల తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. దీనిపై బొమ్మల తయారీ విభాగం, చేనేత, జౌళి శాఖలు ప్రతిపాదనలు రూపొందించాయి. చెక్క బొమ్మల తయారీకి ఉపయోగించే కలప కూడా రాష్ట్రంలో లభ్యమవుతోంది. దీంతో పాటు కార్డుబోర్డును ఉపయోగించి బొమ్మలు తయారు చేస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) బొమ్మల తయారీ కూడా రాష్ట్రంలో ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్స్ బొమ్మలకు డిమాండు భారీగా ఉంది. రిమోట్ కార్లు, హెలికాప్టర్లు, బొమ్మలను ప్లాస్టిక్‌తో తయారు చేస్తున్నారు. తెలంగాణ విద్యా, ఎలక్ట్రానిక్స్ రంగంలో పురోగమిస్తున్నందున ఈ బొమ్మలకు ఆదరణ లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.