తెలంగాణ

telangana

ETV Bharat / state

Employees Transfer: బదలాయింపు కోసం 60 వేల దరఖాస్తులు!

New zonal system implement: రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానంలో భాగంగా బదలాయింపు కోసం ఉద్యోగుల నుంచి 60 వేల దరఖాస్తులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలుజిల్లాల్లో ప్రక్రియ ప్రారంభం కాగా... మిగిలిన చోట్ల ఈ నెల 15 నుంచి మొదలుకానుంది. జిల్లాల్లో ముగిసిన వెంటనే జోనల్‌, బహుళ జోన్లలోనూ బదలాయింపు చేపట్టనున్నారు. డిసెంబరు నెలాఖరు వరకు బదలాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్‌ భావిస్తోంది.

Employees Transfer
Employees Transfer

By

Published : Dec 13, 2021, 5:15 AM IST

Transfer for Employees: రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానంలో భాగంగా సొంత జిల్లాలు, జోన్లు, బహుళ జోన్లకు వెళ్లేందుకు ఉద్యోగులు, అధికారులకు అవకాశం కల్పించగా.. వీటికోసం 60 వేల మంది ఐచ్ఛికాలు (ఆప్షన్లు) సమర్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా... కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ, మెదక్‌ జిల్లాల్లో ఈ నెల 15 నుంచి చేపట్టనున్నారు. జిల్లాల్లో ముగిసిన వెంటనే జోనల్‌, బహుళ జోన్లలోనూ బదలాయింపు చేపట్టనున్నారు. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు ఆర్డర్‌ టు సర్వ్‌ కింద 60 వేల మంది వరకు వెళ్లారు. అదే సమయంలో 5 వేల మందికి పైగా ఇతర జోన్లకు వెళ్లారు. మరోవైపు 2015 నుంచి కొత్తగా ఉద్యోగాలు పొంది ఇతర జోన్లలో పనిచేస్తున్న వారి సంఖ్య మరో 10 వేలు ఉంటుంది. మొత్తంగా ఇతర జిల్లాలు, జోన్లకు వెళ్లిన వారిసంఖ్య 75 వేల వరకు ఉంది.

ఇప్పటికే 24 వేల మంది దరఖాస్తు...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ గల 5 జిల్లాలు మినహాయించి మిగిలిన 4 జిల్లాల్లో సీనియారిటీ జాబితాను రూపొందించి, ఐచ్ఛికాలను ఆహ్వానించింది. ఇప్పటికి 24 వేల మంది ఐచ్ఛికాలకు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఈ ఉమ్మడి జిల్లాల్లో 2016లో ఆర్డర్‌ టు సర్వ్‌ కింద వెళ్లిన ఉద్యోగుల సంఖ్య 30 వేలు ఉండగా... అందులో 6 వేల మంది మినహా మిగిలిన వారు సొంత జిల్లాలకు వెళ్లేందుకు కోరారు. ఇదే ప్రాతిపదికన 15వ తేదీ నుంచి 5 ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభం కానున్న ప్రక్రియలో 26 వేల వరకు ఐచ్ఛికాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఉమ్మడి జిల్లాల్లో సైతం 2016లో 30 వేల మంది ఆర్డర్‌ టు సర్వ్‌లో వెళ్లారు. మొత్తంగా జిల్లాల పరిధిలో 50 వేల దరఖాస్తుల అంచనాతో ఆయా జిల్లాల్లో ఇప్పటికే బదలాయింపులపై కసరత్తు సాగుతోంది.

16 నుంచి జోన్లలోనూ ఐచ్ఛికాల ప్రక్రియ..

మరోవైపు జోన్లలోనూ ఐచ్ఛికాల ప్రక్రియ ఈనెల 16 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జోనల్‌ విధానంలోకి వచ్చే అధికారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రాతిపదికన సొంత జోన్లకు వెళ్లే వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. దాదాపు 15 వేల మంది ఇతర జోన్లలో పనిచేస్తున్నందున అందులో 10వేల మంది వరకు సొంత జోన్లను కోరే అవకాశం ఉంది.

అత్యధికులకు అవకాశం..

ఐచ్ఛికాలు ఇచ్చిన వారిలో అత్యధికులకు సొంత జిల్లాలు, జోన్లు, బహుళజోన్లకు వెళ్లే అవకాశం లభించనుంది. జిల్లాల పరిధిలో ఒకే పోస్టుకు ఎక్కువ పోటీ ఉంటే మినహా మిగిలినచోట్ల సర్దుబాటు జరుగుతుంది. ప్రస్తుతమున్న ఖాళీలు, కొత్త పోస్టుల ప్రాతిపదికన ఎక్కువమందికి బదలాయింపు జరిగే వీలుంది. గత ఏడేళ్లలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో దాదాపు 50 వేల మందికి పైగా నియామకాలు జరిగాయి. రెవెన్యూ, పోలీసు, వైద్యఆరోగ్యం తదితర శాఖల్లో ఎక్కువమంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే వారి నియామకాలు జరిగాయి. జిల్లాలు, జోన్లు, బహుళ జోన్లకు వచ్చే ఐచ్ఛికాల ఆధారంగా... వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని సొంత ప్రాంతాలకు పంపించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. శాఖల వారీగా పోస్టులు, ఐచ్ఛికాలు కోరుకున్న వారి సర్దుబాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 4 జిల్లాల పరిధిలో జాబితాలు మంగళవారం వరకు సిద్ధం కానున్నాయి. మొత్తం బదలాయింపుల ప్రక్రియ డిసెంబరు నెలాఖరు వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇదీ చదవండి:Komatireddy son Wedding: కోమటిరెడ్డి కుమారుడి పెళ్లిలో కేకే, ఈటల ఆత్మీయ ఆలింగనం

ABOUT THE AUTHOR

...view details