Govt Employees Protest: వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన బదిలీల ప్రక్రియను ఉద్యోగులు, ఆయా సంఘాల నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తప్పులతడకగా బదిలీలు చేపట్టారంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. జీవో నంబర్ 317లో సవరణలు చేసి అమలు చేయాలంటూ కోరుతున్నారు.
ఉద్యోగుల ఆందోళన
lack of transparency in transfers: బదిలీలు, పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ...హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశుసంవర్థక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తాజాగా పశుసంవర్థక శాఖలో బదిలీల అంశం గందరగోళంగా మారడంతో తమకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్, యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ సర్వీసు అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 317 జీవో, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా బదిలీలు చేపట్టారని నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే దంపతులతో పాటు ఆయా జోన్ల సిబ్బంది నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించి న్యాయం చేయాలంటూ నినదించారు. తక్షణం 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని సిబ్బంది డిమాండ్ చేశారు. స్పౌస్ కేటగిరి ఉద్యోగులను మల్టీ జోన్‌కు కేటాయిస్తే... భవిష్యత్‌లో అన్నీ ఇబ్బందులేనని ఆందోళన వ్యక్తం చేశారు.
సమన్వయంతో ముందుకు సాగాలి..
సాధారణంగా పశుసంవర్థక శాఖలో సహాయ సంచాలకుల పోస్టు రాష్ట్ర స్థాయి క్యాడర్ పరిధిలో ఉంటుంది. ఎందుకంటే... ఏడీ పోస్టుకు నేరుగా నియామకం ఉండదు. వెటర్నరీ అసిస్టింట్ సర్జన్ నుంచి పదోన్నతిపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమిస్తారు. అంతే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, మామునూరు తదితర ప్రాంతాల్లో పలు పరిశోధన సంస్థలు, శిక్షణ సంస్థల్లో నైపుణ్యం గల పశువైద్యులు, సహాయ సంచాలకులు మాత్రమే పనిచేయగలుగుతారు. ఏడీ పోస్టు జోనల్ పోస్టుగా పరిగణిస్తున్నందన ఎవరికి కూడా ఆ సంస్థల్లో పనిచేసే అవకాశం కలుగదు. ప్రభుత్వ శాఖల్లో బదిలీల్లో అన్యాయం జరగకుండా టీఎన్‌జీఓ, ఇతర ఉద్యోగ సంఘాలతో సమన్వయంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినా... కూడా పశుసంవర్థక శాఖలో అందుకు భిన్నంగా జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. స్వయంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించి గుర్తింపు సంఘాలను పరిగణలోకి తీసుకుని బదిలీలు పారదర్శకంగా చేయాలని ఆదేశించినా... తమ సూచనలు, విన్నపాలను స్వీకరించకపోగా... తప్పులు సరిదిద్దడానికి డైరెక్టర్ సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ ఆక్షేపించింది.
ఏడీ పోస్టును రాష్ట్ర స్థాయి క్యాడర్లోనే ఉంచాలి..
పశుసంవర్థక శాఖ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మల్టీజోన్-1, మల్టీజోన్-2 అని చేశారు. సాధారణంగా పశుసంవర్థక శాఖలో సహాయ సంచాలకులు పోస్టు రాష్ట్ర స్థాయి క్యాడర్ పరిధిలో ఉంటుంది. పలు పరిశోధన సంస్థలు, శిక్షణ సంస్థల్లో నైపుణ్యం గల పశువైద్యులు, సహాయ సంచాలకులు మాత్రమే పనిచేయగలుగుతారు. ఏడీ పోస్టు జోనల్ పోస్టుగా పరిగణిస్తున్నందన ఎవరూ కూడా ఆ సంస్థల్లో పనిచేసే అవకాశం కలుగదు. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును రాష్ట్ర స్థాయి క్యాడర్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం. సీనియార్టీ ప్రకారం కంటే లోకల్ స్టేటస్ ప్రకారం చేయాలని మేము కోరుకుంటున్నాం.
-డాక్టర్ బాబు బేరి, అధ్యక్షుడు, తెలంగాణ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ సర్వీసు అసోసియేషన్