ఇంటి నుంచి పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు ముఖం చాటేస్తున్నారని సంస్థలు చెబుతున్నాయి. మూడో ముప్పు రాబోతుందని.. ఇలాగే ఇంటి నుంచి పనే కొనసాగిద్దామని వినతుల మెయిల్స్ పంపిస్తున్నారట ఉద్యోగులు. అయితే తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ (టీఎఫ్‌ఎంసీ), ఇతర ఐటీ ఆధారిత సంఘాలు ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నా అవి విఫలమవుతున్నాయి. ఇటీవలె హైసియా(హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ అసోసియేషన్) చేసిన అధ్యయనంలోనూ ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనికే మొగ్గు చూపినట్లు తేలింది.
అధ్యయనంలో ఏం తేలింది..?
- 500 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న చిన్న సంస్థలు ఇప్పటికే 20% ఉద్యోగుల్ని కార్యాలయాలకు రప్పించగా.. మధ్యస్థ, భారీ సంస్థలు 5% ఉద్యోగులతో నడిపిస్తున్నాయి. 76% సంస్థలు 9% కంటే తక్కువ మంది ఉద్యోగులను రప్పించాయి.
- ఈ ఏడాది డిసెంబర్ నుంచి దాదాపు 73% సంస్థలు సగం మంది ఉద్యోగులతో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మిగతా 27% సంస్థలు 10% అంతకంటే తక్కువ మందితో పనిచేయించుకోనున్నాయి.
- 2022 మార్చి నాటికి దాదాాపు 2-5లక్షల దాకా ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చే అవకాశముంది.