EMERGENCY LANDING TRAIL RUN SUCCESS : ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా పరిధిలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పరిసరాలు.. కొన్ని గంటలపాటు రన్‌వేను తలపించాయి. కొరిశపాడు వంతెన నుంచి జె.పంగులూరు మండలం రేణింగవరం వంతెన వరకు జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్మించిన రన్‌వేపై నిర్వహించిన టెస్ట్ విజయవంతమైంది. హైవే రన్‌వేపై విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయో లేదో పరీక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక రాడార్ సాంకేతికతంగా సహకరిస్తుందో లేదో పరిశీలించారు. విమానాలు భూమిపై 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించాయి. పూర్తిగా ల్యాండ్ అవకుండా కొన్ని మీటర్ల ఎత్తు నుంచే మళ్లీ పైకి వెళ్లాయి.
"అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ల్యాండింగ్ చేయడం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తరలించడానికి ఈ రన్‌వే అనుకూలంగా ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయనవసరం లేదు. మొత్తం 4 ప్లేన్లు వచ్చాయి. ట్రాన్స్‌పోర్టు ప్లేన్ AM 32 , ఫైటర్ ప్లేన్ సూపర్ 30, తేజస్ 2 ప్లేన్లు ల్యాండింగ్ జరిగాయి" -వీఎం రెడ్డి, భారత వాయిసేన అధికారి
యుద్ధాలు, ప్రకృతి విపత్తుల సమయంలో.. అత్యవసర సేవలతోపాటు.. సైనిక అవసరాలకు ఉపయోగపడేలా ఈ రన్‌వేను తీర్చిదిద్దారు. దీని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు వెచ్చించింది. 2018లో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రన్‌వే నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి 20 రన్‌వేలను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు రన్‌వేలు అందుబాటులోకి వచ్చాయి. కొరిశపాడు వద్ద నిర్మించిన ఈ రన్‌వే అందుబాటులోకి వస్తే... దేశవ్యాప్తంగా మూడోది అవుతుంది. అలాగే.. దక్షిణ భారతదేశంలో ఈ కోవకి చెందిన మొదటి రన్‌వేగా ఘనత సాధించనుంది. ట్రయల్‌రన్ సందర్భంగా గుంటూరు, ఒంగోలు నుంచి వచ్చే వాహనాలను కొన్ని గంటల పాటు దారి మళ్లించారు. రన్‌వే ట్రయల్‌రన్ విజయవంతం కావడం పట్ల వాయుసేన అధికారులు, బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆనందం వ్యక్తం చేశారు.