TS Artisans strike close: వేతన సవరణ, ఫిట్‌మెంట్ విషయంలో తమకు సరైన న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. విద్యుత్ సంస్థలో పనిచేస్తోన్న ఆర్టిజన్ల తలపెట్టిన సమ్మె.. ఇవాళ ముగిసింది. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తోంది తామేనని, తమకు ఫిట్‌మెంట్ విషయంలో సరైన న్యాయం జరగడం లేదని అనేక ఏళ్లుగా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆర్టిజన్లు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఇవాళ ఉదయం సమ్మెకు దిగిన ఉద్యోగులు సాయంత్రానికి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఇవాళ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, డిస్కంల సీఎండీలతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు ఫలించినట్లు తెలిపారు. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయ్స్ యూనియన్ (హెచ్82) ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు స్పష్టం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించారు.
Electricity employees strike: తమ సమస్యలను సీఎం కేసీఆర్తో మాట్లాడి పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమ్మెలో ఉన్నవారు తక్షణమే విధులకు హాజరుకావాలని సాయిలు విజ్ఞప్తి చేశారు. తొలగించిన 200 మంది ఆర్టిజెన్స్ను 10 రోజుల్లో విధుల్లోకి తీసుకొంటామని సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆర్డిజన్ల ప్రధాన డిమాండ్లు: కొద్ది రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సర కాలంగా సరైన వేతన సవరణ లేక ఫిట్‌మెంట్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏడు శాతం ఉన్న ఫిట్‌మెంట్ కనీసం 20 శాతంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిజన్ల పేరుతో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేసి శాశ్వత ఉద్యోగులతో సమానంగా పేస్కేల్ ఇవ్వాలని.. శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని రకాల సెలవులు కూడా వర్తింపజేయాలని విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు.