తెలంగాణ

telangana

ETV Bharat / state

జలమండలికి విద్యుత్ సరఫరా కట్​ చేయొద్దు : ఎస్​ఈఆర్సీ - Hyderabad Metropolitan Development Authority

జలమండలికి సంబంధించిన విద్యుత్ సబ్సిడీలను సకాలంలో విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా..డిస్కంలు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. గతంలో జలమండలికి సంబంధించిన తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు విద్యుత్‌ కనెక్షన్లను కట్‌ చేయబోమని డిస్కంలు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ఈఆర్సీ కోరింది.

electricity subsidies to Hyderabad Metropolitan Development Authority
జలమండలికి విద్యుత్ సరఫరా కట్​ చేయొద్దు

By

Published : Feb 26, 2021, 10:07 AM IST

జలమండలికి సంబంధించిన విద్యుత్‌ సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేయడంలేదని.. వీటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఎస్​ఈఆర్సీ) తోసిపుచ్చింది. జలమండలికి ప్రస్తుతం రాయితీపై అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్‌ స్థానంలో పాత హెచ్‌టీ–4(బీ) కేటగిరీ టారిఫ్‌ను కొనసాగించాలన్న డిస్కంల మరో విజ్ఞప్తిని కూడా ఈఆర్సీ నిరాకరించింది. సత్వరమే పెండింగ్‌ టారిఫ్‌ ప్రతిపాదనలను దాఖలు చేయాలని, టారిఫ్‌ ఉత్తర్వుల్లో జలమండలికి సంబంధించిన ప్రత్యేక టారిఫ్‌ అంశంపై తుది ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

గతంలో జలమండలికి సంబంధించిన తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు విద్యుత్‌ కనెక్షన్లను కట్‌ చేయబోమని డిస్కంలు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ఈఆర్సీ కోరింది. హైదరాబాద్‌ మెట్రో రైలు కోసం యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.95 చొప్పున అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్‌ను తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకూ వర్తింపజేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గతేడాది జులైలో ఈఆర్సీ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో ఈ ప్రత్యేక టారిఫ్‌ను వర్తింపజేయాలని గతంలో ఈఆర్సీ ఆదేశించింది.

ప్రత్యేక టారిఫ్‌ అమలుతో గతేడాది జూన్‌ నాటికి రూ.538.95 కోట్లు నష్టపోయామని డిస్కంలు తెలిపాయి. జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు అవుతున్న ఖర్చులతో పోలిస్తే అవుతున్న వ్యయం అధికంగా ఉందని, 2016–17లో రూ.232 కోట్లు, 2017–18లో రూ.330 కోట్లు, 2018–19లో రూ.299 కోట్లు, 2019–20లో రూ.577 కోట్లు, 2020–21 అక్టోబర్‌ వరకు రూ.265 కోట్ల నష్టాలు వచ్చాయని జలమండలి ఈఆర్సీకి నివేదించింది. పాత టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ ఛార్జీలు పెంచితే భరించలేమని వాదనలు వినిపించింది. డిస్కంలు, జలమండలి వాదనలు విన్న ఈఆర్సీ.. డిస్కంల మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details