హన్మకొండకు చెందిన గుండా సుధాకర్ (76) చిరు వ్యాపారి. కిరాణా దుకాణం నడుపుతున్నారు. నెలకు సగటున రూ.400-500 విద్యుత్ బిల్లు చెల్లిస్తుంటారు. ఈ సారి ఆయనకు రూ. 533.18 బిల్లు రాగా.. దానికి అదనంగా డెవలప్‌మెంటు ఛార్జీల పేరిట రూ.2,832 చెల్లించాలని తాఖీదు పంపారు. ఇంత బిల్లు ఎలా కట్టాలంటూ ఆయన ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో పలువురు వినియోగదారులది ఇదే పరిస్థితి.
గత మూడు నెలలుగా డెవలప్‌మెంట్ ఛార్జీల పేరిట విద్యుత్ శాఖ అదనంగా వడ్డిస్తోంది. ఒక ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు వినియోగించే శక్తి మొత్తాన్ని ఎనర్జీ లోడ్ అంటారు. ఉపకరణాలు పెరిగితే.. లోడ్ అధికమవుతుంది. ఏసీకి 1000-3000 వాట్లు, కంప్యూటర్ 100-250, వాటర్ హీటర్ 550-1500, మిక్సీ 150-750, ఫ్రిజ్ 60-250, బల్బులు 5-60, సీలింగ్ ఫ్యానుకు 50-150 వాట్ల విద్యుత్ ఖర్చవుతుంది. వాడే ఉపకరణాలు పెరిగితే లోడ్ పెరుగుతుంది. ఒక కిలోవాట్‌కు కనెక్షన్ తీసుకుని రెండు కిలోవాట్లు వినియోగిస్తే.. అదనపు కిలోవాట్‌కు డెవలప్‌మెంట్ ఛార్జీల పేరిట రూ.2,836 వసూలు చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.400 కలిపి మొత్తం రూ.3,236 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంపై కొన్నిచోట్ల కిరాయిదారులకు, ఇంటి యజమానులకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అద్దెకున్నవారే చెల్లించాలని యజమానులు చెబుతుండగా.. బిల్లు వరకు తాము చెల్లిస్తామని, డెవలప్‌మెంట్ ఛార్జీలతో తమకు సంబంధం లేదని అద్దెదారులు వాదిస్తున్నారు.