రాష్ట్ర చరిత్రలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా రికార్డుస్థాయిలో శనివారం 13,742 మెగావాట్లు నమోదైంది. ఇంతకుముందు ఈ రికార్డు ఏడాది క్రితం ఇదే రోజున (2021 మార్చి 26) 13,668 మెగావాట్లుగా ఉండగా తాజాగా అది చెరిగిపోయింది. యాసంగి పంటలకు వ్యవసాయ మోటార్ల వినియోగం అధికంగా ఉండటంతో పాటు పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువగా నమోదవుతుండడంతో పరిశ్రమలు, ఇళ్లలో సైతం కరెంటు వినియోగం పెరుగుతోంది. దీంతో డిమాండు రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంచనా వేస్తున్నాయి. నెలరోజులుగా సాగిస్తున్న యుద్ధం కారణంగా విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమ్మోనియం నైట్రేట్ దిగుమతులు లేక బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. బొగ్గు ఆధారంగా నడిచే థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి తగ్గడంతో జాతీయ ఇంధన ఎక్స్ఛేంజీ(ఐఈఎక్స్)లో కరెంటు కొనుగోలు ధర రికార్డుస్థాయిలో యూనిట్‌కు రూ.20కి చేరింది.
యుద్ధంతో కష్టాలు...
బొగ్గు గనుల తవ్వకానికి ముందు మట్టి తీయడానికి పేలుళ్లు జరపాలి. ఇందుకోసం అమ్మోనియం నైట్రేట్ అవసరం. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా విదేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతులు పడిపోయి తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడి థర్మల్ కేంద్రాలకు సరఫరా తగ్గింది. బొగ్గు గనులకు దూరంగా ఉన్న 155 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 57,616 టన్ను బొగ్గు అవసరం కాగా సుమారు 30 శాతమే (17,448 టన్నులే) అందుబాటులో ఉంటోందని కేంద్ర విద్యుత్ మండలి తాజాగా అన్ని రాష్ట్రాలకు పంపిన నివేదికలో స్పష్టం చేసింది. బొగ్గు కొరత కారణంగా విద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో జరగక పోవడంతో ఐఈఎక్స్ కరెంటు ధరలకు రెక్కలొచ్చాయి. యూనిట్ ధర రూ.15 నుంచి 20 వరకూ పలుకుతోంది. తెలంగాణలో ఒక యూనిట్ కరెంటు సరఫరా సగటు వ్యయం రూ.7.03 అవుతుండగా 60 శాతం మంది ప్రజల ఇళ్లకు అంతకన్నా తక్కువ ధరలకే సరఫరా చేస్తున్నట్లు డిస్కంలు తెలిపాయి.