Electric Vehicles Usage Increasing in Telangana : రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ పెరిగిపోతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతుంది. ప్రభుత్వం ఈవీల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో.. కంపెనీలు పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్ మహా నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. సెలెబ్రిటీలు కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేయాలంటే ఈవీల వైపే మొగ్గు చూపుతున్నారు.
Electric Vehicles Usage in Telangana : ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రూ.1.9 కోట్లతో 'టయోటా వెల్‌ఫైర్' కారు కొనుగోలు చేశారు. దానిని ఖైరతాబాద్ ఆర్‌టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరో నటుడు రవితేజ రూ.34.49 లక్షలతో బీవైడీ అట్టో-3 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఆయన కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాజాగా హీరో అల్లరి నరేశ్ రూ.64.95 లక్షలతో కియా ఈవీ 6 జీటీ కారును కొనుగోలు చేశారు. ఖైరతాబాద్ ఆర్‌టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు.
కలిసొస్తున్న రోడ్ ట్యాక్స్ మినహాయింపు..: రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి.. భారీగా ప్రోత్సాహకాలు ఇస్తుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రోడ్ ట్యాక్స్ మినహాయింపు వాహనదారులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తుందని.. అందుకే ఎక్కువ మంది ఈవీ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఆర్‌టీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఇది కూడా వాహనాల కొనుగోలుకు మరో కారణంగా చెబుతున్నారు. ఈవీలను కంపెనీలు పోటాపోటీగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో వాహనాలను తీర్చిదిద్దుతున్నాయి.