భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాల(ఈవీ)దే అని ఓ అధ్యయనం పేర్కొంది. ఈవీల అమ్మకాలు 2030నాటికి హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో గణనీయంగా పెరుగుతాయని ఆ అధ్యయనం గుర్తించింది. ఈవీల వాడకం పెరగాలంటే ఛార్జింగ్ స్టేషన్లను పెంచాలి..అందుకనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. ఛార్జింగ్ సమయాన్ని తగ్గిస్తే ఎక్కువసేపు నడపటానికి అవకాశముంటుందని హైదరాబాద్‌లోని టాక్సీ డ్రైవర్లు సర్వేలో చెప్పారు.
2030నాటికి హైదరాబాద్‌లో టాక్సీ రవాణా వాహనాల్లో 100శాతం ఈవీలే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనావేస్తున్నా, 50శాతానికి మించకపోవచ్చని సర్వే పేర్కొంది. గుజరాత్, తెలంగాణల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఆవశ్యత, ఏర్పాటుపై సహజ వనరుల రక్షణ మండలి(ఎన్‌ఆర్‌డీసీ), గుజరాత్ ఇంధన పరిశోధనా, నిర్వహణ సంస్థ(జెర్మి), అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ) ఈ అధ్యయనం నిర్వహించాయి.
* 2030నాటికి ప్రభుత్వ, ప్రైవేటు రవాణా వాహనాలు 100% ఈవీలే ఉండేలా తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది.
* తొలుత 500 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకయ్యే మూలధనంలో 25శాతం రాయితీ గరిష్ఠంగా రూ.5లక్షల వరకు ఇవ్వాలనే యోచనలో తెలంగాణ ఉంది.
* 2022నాటికల్లా లక్ష ఈవీల విక్రయాలు జరగాలనే లక్ష్యాన్ని గుజరాత్ పెట్టుకుంది.
* హైదరాబాద్‌లో టాక్సీలుగా ఈవీలను నడపాలంటే వాహన జీవితకాల వ్యయంలో 60శాతం విద్యుత్‌కే చెల్లించాల్సి వస్తోంది.
* అధిక రాయితీల ద్వారా ఛార్జింగ్ స్టేషన్లకయ్యే వ్యయంపై తీసుకునే రుణాల తిరిగి చెల్లింపుకాలాన్ని 15ఏళ్ల వరకూ పెంచాలి.
* దేశంలో గతేడాది ఈవీ అమ్మకాల్లో 2.42లక్షలు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలే ఉన్నాయి. 4 చక్రాలవి 4వేలే ఉన్నాయి.
* దేశంలో మొత్తం 1332 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లున్నాయి. ఫేమ్ పథకం కింద 24రాష్ట్రాల్లోని 62నగరాల్లో 2636 స్టేషన్లు మంజూరుచేశారు. వీటికి రూ.వెయ్యి కోట్ల వరకూ రాయితీలివ్వనున్నారు.
ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలి
‘‘కరోనాతో తలెత్తిన ఆర్థిక తిరోగమనం నుంచి కోలుకుని భారత్ సరికొత్తగా తనను ఆవిష్కరించుకునేందుకు ఈవీల రంగంలో పెట్టుబడులు పెట్టి వాటిని ప్రోత్సహించటం మేలైన మార్గమని ఎన్‌ఆర్‌డీసీ సీనియర్ డైరెక్టర్ అంజలి జైస్వాల్ పేర్కొన్నారు. ఈవీల మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు విధానపర అవరోధాలేంటి?అనే అంశాలపై ఏఎస్‌సీఐ, జెర్మి, క్లైమేట్ ట్రెండ్స్ సంస్థల భాగస్వామ్యంతో ఎన్‌ఆర్‌డీసీ బుధవారం వెబినార్ నిర్వహించింది.
‘ఈవీల మార్కెట్‌ను పెంచేందుకు చైనా పెద్దఎత్తున పెట్టుబడులు ఆహ్వానిస్తూ, పలు విధాన నిర్ణయాలు తీసుకుందని ఎన్‌ఆర్‌డీసీ డిప్యూటీ డైరెక్టర్(చైనా) మోనాయూ తెలిపారు . పర్యావరణహితం, ఆర్థికంగా లాభదాయకం కావటం వల్ల వినియోగదారులు వీటినే ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలతో ఈవీల వినియోగాన్ని పెంచవచ్చని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(హంటా) మేనేజింగ్ డైరెక్టర్ కె.విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. ఛార్జర్లను ప్రభుత్వపరంగా బహిరంగస్థలాల్లో ఏర్పాటుచేయటంతోపాటు ప్రైవేటు వ్యక్తులనూ భాగస్వాములు చేయాలని జీఈఆర్‌ఎమ్‌ఐ హెడ్ అఖిలేష్‌మగల్ సూచించారు.
భవిష్యత్తంతా ఈవీలదే అన్న దృష్టితో పునాదివేసుకోవాలని ఏఎస్‌సీఈ అసిస్టెంటు ప్రొ.రాజ్‌కిరణ్ బిలోలికర్ కోరారు. నేషనల్ మిషన్‌ఆన్ ట్రాన్స్‌ఫార్మేటివ్ మొబిలిటీ అండ్ బ్యాటరీ, నీతిఆయోగ్ మిషన్ డైరెక్టర్ అనిల్‌శ్రీవాస్తవ, క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ ఆర్తిఖోస్లా పాల్గొన్నారు.
ఇదీ చదవడి:సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్