హైదరాబాద్ నగరవాసులు క్రమంగా విద్యుత్తు వాహనాల వైపు మొగ్గు (electric vehicles charging stations in hyderabad)చూపుతున్నారు. ద్విచక్ర వాహనాలు మొదలు కార్ల వరకు ఈవీ (electric vehicles) (ఎలక్ట్రికల్ వెహికల్) విక్రయాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తు బ్యాటరీ కార్లదే అనే విశ్వాసం కొనుగోలుదారుల్లో కన్పిస్తోంది. సిటీ రహదారులపై కన్పిస్తున్న ఆకుపచ్చ రిజిస్ట్రేషన్ ప్లేట్లే ఇందుకు నిదర్శనం. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థకు ఎలక్ట్రికల్ వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఇప్పటి వరకు 66 దరఖాస్తులు రాగా, 53 స్టేషన్లకు అనుమతులు జారీ చేశారు. కొన్ని పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 35 స్టేషన్లను ఆయా సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ఎక్కడెక్కడంటే..
నగరంలో ముఖ్యమైన ప్రాంతాలు, మెట్రో స్టేషన్లు, పెట్రోల్ పంపులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ సంస్థల్లో విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. పంజాగుట్ట, బేగంపేట, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, నాగోల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఆటోమొబైల్ సంస్థలు సైతం తమ షోరూంలు, ముఖ్యమైన ప్రదేశాల్లో ఛార్జ్ అండ్ డ్రైవ్ పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. సౌర విద్యుత్తుతో నడిచే ఛార్జింగ్ స్టేషన్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు.
పెట్రోల్ పంపుల్లో...
మున్ముందు ప్రతి పెట్రోల్ పంపులోనూ విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ పాయింట్లు (electric vehicles charging stations in hyderabad) రానున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పటికే కొన్ని స్టేషన్లలో మొదలుపెట్టింది. మిగతా కంపెనీలు వీరి బాటలోనే నడవనున్నాయి. ఇంధన ధరలు ఏడాది కాలంలో 35 శాతం పెరగడంతో ఈవీ సాంకేతికత మెరుగుకావడం, పలు ఈవీ వాహనాలు అందుబాటులోకి రావడంతో ఛార్జింగ్ స్టేషన్లకు మున్ముందు మరింత డిమాండ్ ఉంటుందని ఇంధన సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో ఉన్న విద్యుత్తు ఉప కేంద్రాల్లోనూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డిస్కంతో టీఎస్ రెడ్కో చర్చిస్తోంది. నగరవ్యాప్తంగా 118 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు నోడల్ సంస్థగా టీఎస్ రెడ్‌క్కో ప్రయత్నాలు చేస్తోంది.