Electric Charging Stations in Hyderabad: పర్యావరణ హితం కోసం విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని నమోదు చేస్తూ విశ్వనగరం దిశగా దూసుకెళ్తోన్న హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను (తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ) టీఎస్ రెడ్కో ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఇదివరకే నగర పరిధిలో 150 విద్యుత్ ఛార్జింగ్ యూనిట్ కేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభించగా.. ఈ నెల చివరి నాటికి ముప్పై విద్యుత్ ఛార్జింగ్ యూనిట్లను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు నిర్దేశించుకున్నారు.
కొత్త విద్యుత్త్ ఛార్జింగ్ కేంద్రాలకు చాలా ప్రత్యేకతలున్నాయని యంత్రాంగం చెబుతోంది. 60 కిలో వాట్ల సామర్థ్యం గల యంత్రంతో ఛార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కారు బ్యాటరీకి అర గంటలో ఛార్జింగ్ పూర్తి అవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. అన్ని రకాల విద్యుత్ వాహన సేవలను అరచేతికి అందించడమే లక్ష్యంగా.. దేశంలోనే ప్రథమంగా ‘టీఎస్ ఈవీ’ అనే మొబైల్ యాప్ను రూపొందించామని, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు ఉపయోగపడే యాప్ సేవలను త్వరలో ప్రారంభిస్తామని రెడ్కో యంత్రాంగం స్పష్టం చేసింది.
బయటి కంటే తక్కువ ధరకే..:ప్రైవేటు విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాల్లో ఒక్కో యూనిట్ రూ.18 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారని, రెడ్కో ఆధ్వర్యంలోని ఛార్జింగ్ కేంద్రాల్లో అంతకన్నా తక్కువ రుసుము ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.