TSRTC Ordered 550 Electric buses: టీఎస్ఆర్టీసీకి త్వరలో భారీగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. పర్యావరణ పరిరక్షణ దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే టీఎస్ఆర్టీసీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్‌కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్టీసీకి సరఫరా చేస్తుంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఆర్టీసీ మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించిందని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు.
విడతల వారీగా అందుబాటులోకి: వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నామని ఆయన అన్నారు. మార్చి 2025 నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మొదటి దశలో 550 ఈ-బస్సులను కొనుగోలు చేస్తున్నామని, ఈ బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. టీఎస్ఆర్టీసీ నుంచి 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ వచ్చిందని, ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ తెలిపారు.
కాలుష్యం తగ్గించి సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి:వీటిలో స్టాండర్డ్ ఫ్లోర్ 12 మీటర్లున్న 500 ఇంట్రాసిటీ బస్సులు, 50 ఇంటర్సిటీ కోచ్ ఈ-బస్సులున్నాయన్నారు. ఈ బస్సులను త్వరలో దశల వారీగా పంపిణీ చేస్తామన్నారు. ఈ బస్సులు నగరంలో ధ్వని, వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆర్డర్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదని ఓజీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ వెల్లడించారు. ఎయిర్ కండీషన్డ్ ఇంటర్సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు మహా నగరాలైన హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
ఏ ఏ డిపోల్లో ఏర్పాటు చేయనున్నారంటే: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నగర పరిధిలో తిరగనున్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225పైగా కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ, నిర్వహణ, కార్యకలాపాల కోసం టీఎస్ఆర్టీసీ జంట నగరాల్లో ఐదు డిపోలను నిర్ణయించింది. దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, జీడిమెట్ల, మియాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లలో డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది.
ఇవీ చదవండి: