డీజిల్ ఇంజిన్ స్థానంలో బస్సులను విద్యుత్ బ్యాటరీతో నడిచేలా మార్చేందుకు ఏపీ ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తిరుపతి-తిరుమల ఘాట్, తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో విద్యుత్ బస్సులు నడపాలని యోచిస్తున్నారు. గతంలో కొత్త విద్యుత్ బస్సులు తీసుకొని నడపాలని అనుకున్నప్పటికీ, గుత్తేదారు కిలోమీటర్‌కు ఎక్కువ ధర కోట్ చేయడంతో ఆ ప్రతిపాదన ఆపేశారు. ఇప్పుడు పాత వాటికే ఇంజిన్ మార్చి విద్యుత్ బస్సులుగా నడిపేందుకు సన్నద్ధమవుతున్నారు.
అనంతపురానికి చెందిన వీరా వాహన సంస్థ ప్రయోగాత్మకంగా ఆర్టీసీకి చెందిన ఒక సప్తగిరి ఎక్స్‌ప్రెస్ పాత బస్సును బ్యాటరీతో నడిచేలా మార్పులు చేసింది. కొద్ది రోజుల కిందట దానిని తిరుమల ఘాట్‌లో నడిపారు. అనుకున్నట్లుగానే ఛార్జింగ్‌కు సరిపడా మైలేజ్ వచ్చింది. దీంతో 150 బస్సులను విద్యుత్ బ్యాటరీతో నడిచేవిగా మార్చాలనుకుంటున్నారు. దాదాపు రెండేళ్లపాటు వీటి పనితీరును పరిశీలించిన తర్వాత ఏపీలో మరిన్ని సర్వీసులు అమలు చేసే ఆలోచనలో ఉన్నారు.