Elections Vote Process in Telugu : ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు జాబితాలో ఓటరు తన పేరు కలిగి ఉండాలి. లేనిపక్షంలో ఓటేసేందుకు అనర్హులవుతారు. అందుకే ముందుగా తన ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవాలి. ఇందుకోసం సంబంధిత బీఎల్‌వో(బూత్ లెవెల్ ఆఫీసర్)లు ఇచ్చే పోల్ చీటీల వెనుక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పోలింగ్ కేంద్రం తెలుస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునే వారు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి. పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల గుర్తులు, కండువాలు, వస్త్రాలు ధరించకూడదు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అధికారులు అనుమతించరు. సాధారణ ఓటరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లటమే కాకుండా భద్రత సిబ్బందికి సహకరించాలి. ఓటు హక్కు వినియోగించుకునే వారికి పోల్ చీటీ ఒక్కటే ప్రామాణికం కాదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 16 ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్తేనే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు.
Smallest Polling Booth : 3 ఇళ్లు.. 5 ఓట్లు.. అతి చిన్న పోలింగ్ బూత్.. ఎక్కడో తెలుసా?
ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవటం మొదలైనప్పటి నుంచి ఓటు సరిగ్గానే నమోదవుతుందా అనే సందేహం ఓటర్లకు కలుగుతోంది. అందుకే ఎన్నికల సంఘం ఈ సమస్యకు వీవీ ప్యాట్ యంత్రం ద్వారా పరిష్కారం చూపింది. ఓటరు తన ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత ఏ గుర్తుపై ఓటేశారో ఏడు సెకన్ల పాటు వీవీ ప్యాట్ మిషన్ తెరపై ఆ గుర్తు కనిపిస్తుంది. దాని ఆధారంగా ఓటు నిర్ధారించుకోవచ్చు. ఓటేసిన గుర్తు.. తెరపై కనిపించే గుర్తు సరిపోలితేనే ఓటు పారదర్శకంగా పడినట్లు లెక్క. లేనిపక్షంలో ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.