Election Squad Raids At EX IAS AK Goyal House : హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 23/ఏలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ నివాసం ఉంటున్నారు. 2010లో ఉద్యోగ విరమణ పొందిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా విధులు నిర్వహించారు. అయితే గోయల్ నివాసంలో భారీ ఎత్తున నగదు డంప్ చేశారంటూ.. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఎన్నికల సంఘానికి, ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలకు సిద్ధమయ్యారు.
Congress Leaders Protest at EX IAS AK Goyal House :కాంగ్రెస్ నాయకులు మల్లు రవి (Congress Leader Mallu Ravi), అనిల్ కుమార్ యాదవ్, పార్టీ కార్యకర్తలు.. అక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే అదే సమయంలో ముగ్గురు కానిస్టేబుళ్లు ద్విచక్రవాహనాలపై.. విలువైన వస్తువులు తీసుకెళ్తున్నారని హస్తం శ్రేణులు అడ్డుకున్నారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లోని మహిళా అధికారిని కూడా అడ్డగించారు. ఈ క్రమంలోనే వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ జరిపారు.
ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన మాజీ ఎంపీ వివేక్ - విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా 100 కోట్లు బదిలీ!
శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఏకే గోయల్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. పెద్దఎత్తున నగదు తరలిస్తున్నారంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ (Congress Candidate Mohammed Azharuddin) అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. ఫిర్యాదు చేసిన తమ పైనే పోలీసులు దాడి చేశారని, గోయల్ ఇంట్లో సుమారు రూ.400 కోట్లు ఉన్నాయని మల్లు రవి ఆరోపించారు.
"ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. ఇలా అయితే ఎన్నికలు ఎలా సజావుగా సాగుతాయి. ఏకే గోయల్ ఇంట్లో భారీగా నగదు ఉందని ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేశాం. అలాగే ఆదాయపన్ను శాఖకు సమాచారం ఇచ్చాం. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ,ఐటీ అధికారులు వచ్చారు, వెళ్లిపోయారు. అలాంటప్పుడు ఏమి జరిగిందో కూడా అధికారులు వివరాలను చెప్పకుండా వెళ్లిపోవడం చాలా దారుణం." - మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ నేత