తెలంగాణ

telangana

శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు మేం సిద్ధం

By

Published : Apr 10, 2019, 5:39 AM IST

Updated : Apr 10, 2019, 6:49 AM IST

రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు శాంతిభద్రతల అదనపు డీజీ, నోడల్​ అధికారి జితేందర్​ తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర బలగాలకు తోడు కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు జితేందర్​ తెలిపారు.

ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాం

రాష్ట్రంలోని 17 లోక్​సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్​ వెల్లడించారు. ఎన్నికల కమిషన్​తో సమన్వయం చేసుకొని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 34 వేల 601 పోలింగ్ స్టేషన్లున్నాయని, 5,749 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని తెలిపారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ సందర్భంగా ఏదైనా సమస్యలు సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేంద్రం నుంచి 145 కంపెనీల బలగాలు

రాష్ట్రవ్యాప్తంగా 56వేల మంది రాష్ట్ర పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకోనున్నారు. ఇతర రాష్ట్రాలైన కర్నాటక, హరియాణా, రాజస్థాన్, హిమాచల్​ప్రదేశ్, ఝార్ఖండ్ నుంచి సుమారు 10వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో భాగస్వాములు కానున్నారు. వీరికి అదనంగా 145 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంచామని జితేందర్​ తెలిపారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు

నిజామాబాద్​ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో రైతులు పోటీలో ఉన్నారని , ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అదనపు డీజీ చెప్పారు. డీఐజీ స్థాయి అధికారి అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారని , అదనపు భద్రతా సిబ్బందిని కూడా అక్కడకు పంపినట్లు తెలిపారు.

గతనెల రోజుల తనిఖీల్లో...

  • రూ.37 కోట్ల నగదు స్వాధీనం.
  • కోటి రూపాయల విలువ చేసే 31వేల లీటర్ల మద్యం స్వాధీనం
  • 28లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి స్వాధీనం
  • 28లక్షల రూపాయల విలువ చేసే మత్తుపదార్థాల స్వాధీనం
  • 8వేల 528 ఆయుధాలు డిపాజిట్
  • 4వేల నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ
  • 87వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు
  • ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ఇతర సంఘటనల్లో 453 కేసులు నమోదు.

నిరంతర పర్యవేక్షణ

ఎన్నికల రోజు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని పర్యవేక్షించడానికి డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేశారు. సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్​లో ఉండి పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు... క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాం

ఇవీ చూడండి: ఓట్ల పండగ వచ్చే... ప్రయాణానికి అవస్థలు తెచ్చే

Last Updated : Apr 10, 2019, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details