Election For Three Rajya Sabha Seats In Telangana: వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీన రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్ పదవీకాలం ముగియనుంది. వీరిస్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. ప్రతి 39.6 సభ్యులకొకరు చొప్పున ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు : కిషన్‌రెడ్డి
Rajya Sabha Seats In Telangana: ప్రస్తుతం ఈ పూర్తి కోటాతో ఏ పార్టీ కూడా రెండు గానీ, మూడు గానీ సీట్లు గెలిచే అవకాశం లేదు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ మిత్ర పక్షాలతో కలిసి పోటీలోకి దిగినా ఒక సీటుకు సరిపడా మాత్రమే ఓట్లున్నాయి. రెండో సీటుకు మెజారిటీ చాలదు. తమకున్న బలాల మేరకే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది.
ప్రస్తుత ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్‌కు 64 మంది, మిత్రపక్షమైన సీపీఐకి ఒకరు, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, మజ్లిస్‌కు ఏడుగురు సభ్యుల బలం ఉంది. నిర్ణీత 39.6 శాతం ఓట్ల ప్రకారం.. కాంగ్రెస్ తన బలంతో ఒక సీటును గెలుచుకున్నాక ఆ పార్టీకి సీపీఐతో కలిపి మరో 25 ఓట్లు ఉంటాయి. అంటే రెండో స్థానంలో 40 ఓట్లు సాధించడం కష్టమే. మరోవైపు బీఆర్ఎస్ కు 39 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దాని మిత్రపక్షమైన మజ్లిస్‌కు గల ఏడు స్థానాలు కలిస్తే మొత్తం 46 అవుతాయి. అంటే ఒక సీటు గెలిచాక మిగిలేవి ఆరు ఓట్లు. 40 ఓట్ల కోటాతో రెండో స్థానంలో అది పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు.
Election For Three Rajya Sabha Seats In Telangana : రాష్ట్రంలో మూడు స్థానాలు ఖాళీ అవుతున్నందున ముగ్గురే అభ్యర్థులు బరిలో నిలిస్తే పోలింగుతో, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ముగ్గురికి మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగ్ అనివార్యమవుతుంది. అప్పుడు మొదటి మూడు స్థానాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. కాంగ్రెస్‌కు ఒక స్థానం గెలిచే ఓట్ల కంటే మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది.