Election Exercise In Telangana : నవంబర్ లేదా డిసెంబర్లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం ఇటీవలే హైదరాబాద్లో మూడు రోజుల పాటు పర్యటించి ఎన్నికల సన్నద్ధతను సమీక్షించింది. ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, సన్నద్ధత, సన్నాహకాలను జిల్లాల వారీగా సమీక్షించింది. ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు చేసిన కసరత్తు, ప్రత్యేకించి ఓటర్ల జాబితా సంబంధిత అంశాలు, బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలనపై ఈసీ ప్రతినిధులు ఎక్కువగా దృష్టి సారించారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన వివరాలపై వారు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఆయా జిల్లాల సమాచారం, వివరాలు ఏ మాత్రం పొంతన లేవని కేంద్రం ఎన్నికల సంఘ బృందం వ్యాఖ్యానించారు. 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులు తదితరాలకు సంబంధించిన సమాచారం సరిగా లేదని అభిప్రాయపడ్డారు. బీఎల్ఓల ఇంటింటి పరిశీలనపైనా ఈసీ ప్రతినిధులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఎల్ఓలతో జరిపిన సమావేశంలోనూ కొందరి సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం.
అన్ని జిల్లాల్లో ప్రారంభమైన ఎన్నికల కసరత్తు : ఈసీ సమీక్ష అనంతరం ఎన్నికల కసరత్తును జిల్లాల్లో మరింత వేగవంతం చేయనున్నారు. ఓటర్ల జాబితా, చిరునామాల అప్డేషన్, బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలన, డూప్లికేట్ ఓట్ల తొలగింపు ప్రక్రియ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, తదితర అంశాలపై తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు.