తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొవిడ్‌ నిబంధనలు.. ఈసీ ఉత్తర్వులు - GHMC elections with corona rules

కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాన ఆయుధం ‘మాస్కు’ అని ఇప్పటికే నిపుణులు పదేపదే చెబుతున్న నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఈ ఆయుధాన్ని తప్పనిసరిగా ధరించాల్సిందే.

corona guidelines for GHMC elections 2020
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొవిడ్‌ నిబంధనలు

By

Published : Nov 19, 2020, 6:27 AM IST

బల్దియా ఎన్నికల్లో ఓటు వేయాలంటే మాస్కు తప్పనిసరి అని ఈసీ స్పష్టం చేసింది. ముఖానికి సరైన నిర్దేశిత విధానంలో మాస్కు ధరించకపోతే పోలింగ్‌ స్టేషన్‌లోకే అసలు అనుమతించరు. అయితే ఓటరును గుర్తించేందుకు వీలుగా ఒకసారి మాస్కును తొలగించి తిరిగి వెంటనే పెట్టుకోవచ్ఛు పోలింగ్‌ బూత్‌లోకి కూడా ఒక్కొక్కరుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఓటు వేసేందుకు నిలబడే వరుసలోనూ ఒక్కో వ్యక్తికి మధ్య 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. ఇందుకోసం వృత్తాకారంలో గుర్తులు ఏర్పాటు చేయాలి. వాటిలో ఓటర్లు నిలబడేలా పర్యవేక్షించాలి. ఎన్నికల సమయంలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను వైద్యఆరోగ్యశాఖ ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఆరోగ్యశాఖ సూచనలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

తప్పనిసరి మార్గదర్శకాలివి..

*ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనే ప్రతిఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలి.

*రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది తమ కార్యక్రమాలను విశాలమైన హాళ్లల్లో నిర్వహించుకోవాలి.

*నామినేషన్‌ సమర్పించడానికి అభ్యర్థితోపాటు మరో ఇద్దరినే అనుమతిస్తారు.

*రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌లో భౌతిక దూర నిబంధనలను అనుసరించి నామినేషన్‌, పరిశీలన, చిహ్నాల కేటాయింపు వంటి విధులను నిర్వహించాలి. అందుకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి.

*పోలింగ్‌ జరిగే ప్రాంగణాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.

*పోలింగ్‌ సిబ్బంది ప్రయాణాల్లో కిక్కిరిసి వెళ్లకూడదు. అందుకు తగ్గట్లుగా వాహనాలు సమకూర్చుకోవాలి.

*ఎన్నికల సిబ్బంది ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

*పోలింగ్‌ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తక్షణమే వారి స్థానంలో మరొకరిని నియమించేందుకు వీలుగా రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి.

*ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో శానిటైజర్లను ఏర్పాటుచేయాలి.

*కొవిడ్‌ జాగ్రత్తలపై అవగాహన పెంపొందించే గోడపత్రాలను ప్రదర్శించాలి.

*పోలింగ్‌ అధికారులకు, భద్రతా సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్​షీల్డ్​లు అందించాలి.

*రోడ్డు ప్రదర్శనల్లో భద్రతా వాహనాలను మినహాయిస్తే.. మిగిలిన వాహనాల మధ్య 100 మీటర్ల దూరం పాటించాలి.

*ఒకే మార్గంలో రెండు వేర్వేరు రాజకీయ పార్టీ అభ్యర్థుల రోడ్‌షోల మధ్య కనీసం అరగంట వ్యత్యాసం ఉండాలి.

*బ్యాలెట్‌ పెట్టెలను లెక్కించే ముందు శుభ్రపరచాలి.

ABOUT THE AUTHOR

...view details