Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాల ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఈసీ నియమించింది. ఈ మేరకు అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్ వ్యవహరించనున్నట్లు ఈసీ పేర్కొంది.
అదేవిధంగా మిగిలిన 32 జిల్లాలకు ఎన్నికల అధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈఆర్వోలుగా.. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఐటీడీఏ పీఓలు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఓటర్ల జాబితా నిర్వహణ, ఓటర్ల నమోదు, వివరాలు తదితరాలను ఈఆర్వోలు పర్యవేక్షిస్తారు.
Deputy Commissioners Transferred in GHMC :మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికారుల బదిలీలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో భారీగా డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. మొత్తం 26 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ జీహెచ్ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కమిషనర్, జోనల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కింది స్థాయిలో పనిచేస్తున్న డీసీలను కూడా బదిలీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 30 మంది డిప్యూటీ కమిషనర్లు ఉండగా.. వారిలో 26 మందిని బదిలీ చేశారు. గతంలో నలుగురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేశారు.