EC Team Visits in Hyderabad for Three Days : రాష్ట్ర శాసనసభకు వచ్చే ఏడాది జనవరి 16వ తేదీలోగా ఎన్నికలు పూర్తై.. కొత్త సభ కొలువు తీరాల్సి ఉంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహకాలను ప్రారంభించింది. ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధం చేయడం, అధికారులకు శిక్షణ సహా సంబంధిత అంశాలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను కూడా చేపట్టింది. రేపటిలోగా బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలనా ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.
EC Delegation Visits Telangana Today :ఈ క్రమంలోనే ఆగస్టు రెండో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించి.. దానిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించి అక్టోబర్ నాలుగో తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించనున్నారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీతోపాటు అధికారులకు శిక్షణ ప్రక్రియ కొనసాగుతోంది. వీటితోపాటు ఇతర సన్నాహకాలు, కసరత్తు, ఏర్పాట్లను ఈసీ బృందం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సమీక్షించనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఈసీ అధికారుల బృందం నగరానికి చేరుకొంది.
Telangana Assembly Elections 2023 :ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్.. పోలీస్ నోడల్ అధికారి, కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారితో ఈసీ బృందం సమావేశం కానుంది. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడంతోపాటు ఎన్నికల నిర్వహణ, భద్రత సంబంధిత అంశాలపై చర్చిస్తారు. అనంతరం ఆదాయపన్ను, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎక్సైజ్, జీఎస్టీ, ఈడీ, డీఆర్ఐ, ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రతినిధులతో సమావేశమవుతారు.